Site icon NTV Telugu

Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు ఎన్నిక

Khamenei

Khamenei

ఇరాన్ సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఖమేనీ (56) నియమితులయ్యారు. తమ పాత్ర లేకుండా ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎవరు ఎన్నికైనా చంపేస్తామని అమెరికా, ఇజ్రాయెల్ హెచ్చరించిన తర్వాత కూడా మోజ్తాబా ఖమేనీ ఎన్నిక కావడం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అత్యున్నత పదవికి ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఎన్నికైనట్లుగా ఇరాన్ మీడియా తెలిపింది.

మోజ్తాబా కూడా తండ్రిలాగే రాడికల్ మతాధికారి. సుప్రీం లీడర్ ఇరాన్‌లోని అన్ని విషయాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అధ్యక్షుడు కంటే సుప్రీం లీడర్‌కే ఎక్కువ అధికారం ఉంటుంది. మోజ్తాబాకు రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) నుంచి పూర్తి మద్దతు ఉంది. ఆ కారణంతోనే మోజ్తాబా ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యాడు.

ఇదిలా ఉంటే కొత్త ఇరాన్ సుప్రీం లీడర్‌ను కూడా అంతమొందిస్తామని అమెరికా, ఇజ్రాయెల్ హెచ్చరించాయి. ఆదివారం ఏబీసీ న్యూస్‌తో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘మా అనుమతి లేకపోతే ఎక్కువ కాలం ఉండడు.’’ అని హెచ్చరించారు. అంతకముందే ఇజ్రాయెల్ కూడా వార్నింగ్ ఇచ్చింది. కొత్త ఇరాన్ సుప్రీం లీడర్‌ను కూడా చంపేస్తామని సూచించింది.

మోజ్తాబా..
మోజ్తాబా ఖమేనీ 1969లో ఇరాన్‌లోని మష్హాద్‌లో జన్మించారు. మతపరమైన విద్యను అభ్యషించారు. అలాగే హుజ్జతుల్-ఇస్లాం బిరుదును పొందారు. మోజ్తబా ఇరాన్-ఇరాక్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. ఇప్పటి వరకు మోజ్తబా ఖమేనీ ఎటువంటి ప్రభుత్వ పదవిని చేపట్టలేదు. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరిగా ఎన్నికయ్యారు.

మోజ్తబా తండ్రికి నీడలా ఉండే వ్యక్తిగా పనిచేశాడు. ఇరాన్‌లో అధికార పీఠమైన తన తండ్రి కార్యాలయం, బీట్-ఎ రహ్బరి పనితీరులో కీలక పాత్ర పోషించారు. ఇరాన్ సాయుధ దళాలు, రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, మిలీషియా, బాసిజ్‌పై కూడా పరోక్ష నియంత్రణ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

Exit mobile version