US-IRAN War: అమెరికా యుద్ధ విమానాలను ధ్వంసం చేశాం.. ఇరాన్ సంచలన ప్రకటన.

  • జోర్డాన్‌లోని అమెరికా లక్ష్యాలపై దాడి చేశామన్న ఇరాన్.
  • పలు అమెరికా ఫైటర్ జెట్లు, రీఫ్యూయలింగ్ విమానాలు ధ్వంసమయ్యాయని వాదన.
  • సిరియాలోని అమెరికా కమాండ్ సెంటర్‌పై కూడా దాడి చేసినట్లు ప్రకటన.
Iran War

Iran War

US-IRAN War: అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాలుస్తోంది. అమెరికా వైమానిక దాడుల పరంపరను కొనసాగిస్తుంది. దీనికి ప్రతిగా ఇరాన్ బహ్రైయిన్, ఖతార్, కువైట్ లలో ఉన్న అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే జోర్డాన్‌లోని అమెరికా సైనిక లక్ష్యాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు నిర్వహించామని ఇరాన్ ప్రకటించింది. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు, ఇంధనం నింపే విమానాలు ధ్వంసమైనట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) వెల్లడించింది.అమెరికా రాత్రి జరిపిన దాడుల్లో 8 మంది మరణించిన నేపథ్యంలో దీనికి ప్రతీకారంగా దాడులు చేశామని చెప్పింది.

ఐఆర్‌జీసీ విడుదల చేసిన ప్రకటనలో అమెరికాకు తీవ్ర నష్టం కలిగించినట్లు చెప్పింది. జోర్డాన్‌లో అమెరికాను లక్ష్యంగా చేసుకోవాలని ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చింది. మరోవైపు, సిరియాలోని అల్ తన్ప్ ప్రాంతంలో ఉన్న అమెరికా స్పెషల్ ఆపరేషన్ కమాండ్ సెంటర్‌పై కూడా దాడి చేసినట్లు ఇరాన్ పేర్కొంది. అయితే, ఈ దాడిపై అటు అమెరికా, ఇటు సిరియా నుంచి ఎలాంటి అధికారిక ధ్రువీకరన రాలేదు. ఇదిలా ఉంటే, ఇరాన్ ప్రకటనకు భిన్నంగా స్పందించిన జోర్డాన్.. ఇరాన్‌కు చెందిన మూడు క్షిపణుల్ని కూల్చేసినట్లు ప్రకటించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగలేదని చెప్పింది. అమెరికా దాడులు కొనసాగినంత కాలం హార్ముజ్ జలసంధి ద్వారా చమురు, గ్యాస్ సరఫరా జరగవని ఇరాన్ తేల్చి చెప్పింది.