Iran: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అమెరికా, ఇరాన్ మధ్య దాడులు తీవ్రరూపం దాల్చాయి. వరసగా ఏడో రోజు కూడా అమెరికా, ఇరాన్‌లోని మౌలిక సదుపాయాలపై దాడులు చేసింది. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇలా ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. రాజధాని టెహ్రాన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబ సభ్యుల్ని చంపేస్తామంటూ బిల్‌బోర్డ్ ఏర్పాటు చేసింది.
ఇరాన్ ప్రకటనలో మంటల్లో తగలబడుతున్న వైట్‌హౌజ్ బ్యాక్ గ్రౌండ్‌లో ఉండగా, ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా, పిల్లలు ఇవాంకా, డోనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్, టిఫనీ, బారన్ ట్రంప్‌ల చిత్రాలను అమెరికా జెండా కప్పిన శవపేటికల్లో ఉంచినట్లు ఫోటోలు ప్రదర్శించారు. దీనిపై పర్షియన్ భాషలో ‘‘రక్తానికి రక్తం’’ అనే నినాదాన్ని రాశారు. ఇటీవల ఇరాన్ మరో బిల్‌బోర్డులో ట్రంప్‌ను ఒక్కరినే శవపేటికలో చూపించింది.
టెహ్రాన్‌లోని వాలియాసర్ స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన ఈ భారీ ప్రచార చిత్రాలను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)తో అనుబంధం ఉన్న ఓజ్ ఆర్ట్స్ అండ్ మీడియా ఆర్గనైజేషన్ రూపొందిస్తుందని సమాచారం. ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అమెరికా-ఇజ్రాయిల్ దాడుల్లో ఫిబ్రవరి 28లో చనిపోయారు. తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇటీవల కొత్త సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ హెచ్చరించారు. మరోవైపు, తనను చంపాలని ఇరాన్ చూస్తోందని, తనపై హత్యాయత్నం జరిగితే ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడి చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు.

