Iran Arrests Actor Of Oscar Winning Movie Over Anti-Hijab Protests: ఇస్లామిక్ కంట్రీ ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక అల్లర్ల కొనసాగుతూనే ఉన్నాయి. వరసగా ఆ దేశం అల్లర్లలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేస్తోంది. ఇప్పటికే అక్కడ పలువురికి ఉరిశిక్ష విధించింది. ఇదిలా ఉంటే ఆస్కార్ విన్నింగ్ మూవీలో నటించిన నటిని అరెస్ట్ చేసింది ఇరాన్ ప్రభుత్వం. 38 ఏళ్ల తరనేహ్ అలిదూస్తీని శనివారం అరెస్ట్ చేసినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. తప్పుడు, వక్రీకరించే కంటెంట్ ను ప్రచురించినందుకు, గందరగోళ పరిస్థితులకు కారణం అయినందుకు అలిదూస్తీని ఇరాన్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది.
Read Also: FIFA World Cup 2022: ఫిఫా తుది సమరం నేడే… నువ్వా నేనా అంటున్న అర్జెంటీనా, ఫ్రాన్స్
2016లో ‘ది సేల్స్‌మాన్’ సినిమాలు నటించింది తరనేమ్ అలిదూస్తీ. ఈ సినిమాలో పోషించిన పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఇటీవల మొహ్సేన్ షెకారీ(23) అనే వ్యక్తిన హిజాబ్ నిరసనల్లో పాల్గొనందుకు ఉరితీసింది. అయితే దీనికి వ్యతిరేకంగా డిసెంబర్ 8న అలీదూస్తీ సోషల్ మీడియాలో నిరసన తెలిపారు. ‘ఈ రక్తపాతాన్ని చూస్తూ ఎలాంటి చర్యలు తీసుకోని అంతర్జాతీయ సంస్థలు మానవత్వానికి అవమానకరం’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో కామెంట్స్ చేసింది. చిన్న తనం నుంచి సినిమాలో నటిస్తోంది అలీదూస్తి. ఇటీవల ఆమె నటించిన ‘ లీలాస్ బ్రదర్స్’ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది.
కుర్దిష్ మూాలానికి చెందిన 22 ఏళ్ల ఇరాన్ మహిళ మహ్సా అమినీ మరణంతో ఇరాన్ గత మూడు నెలలుగా అట్టుడుకుతోంది. హిజాబ్ ధరించలేదని అక్కడి మోరాలిటీ పోలీసులు మహ్సా అమినీని నిర్భంధించిన తర్వాత ఆమె చనిపోయింది. దీంతో ఇరాన్ వ్యాప్తంగా మహిళలు, యువత పెద్ద ఎత్తున హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు చేశారు. మహిళలు హిజాబ్ విసిరేస్తూ, జట్టు కత్తిరించుకుంటూ నిరసన తెలిపారు. ఈ ఆందోళనల్లో ఇప్పటి వరకు 400 మంది పైగా మరణించినట్లు తెలుస్తోంది. గతంలో కూడా అలీదూస్తి, హిజాబ్ ధరించకుండా ఆందోళనపై కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకు ఇరాన్ ప్రభుత్వం నిరసనల్లో పాల్గొన్న 9 మందికి మరణశిక్ష విధించింది. ఇందులో కొందర్ని బహిరంగంగా ఉరితీసింది. వేలాడి మంది అరెస్ట్ చేయబడ్డారు. 400 మందికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది అక్కడి ప్రభుత్వం.