BRICS Business Forum: భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని.. త్వరలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఎదుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇండియాలో మిషన్ మోడ్ సంస్కరనలు భారత్‌లో సులభతర వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచాయని తెలిపారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో ప్రధాని పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ లీడర్స్ డైలాగ్‌లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. 2019 తర్వాత బ్రిక్స్ దేశాల తొలి వ్యక్తిగత సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కల్లోలం ఉన్నప్పటికీ, భారత్ నేడు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని అన్నారు. త్వరలోనే భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచ వృద్ధి చోదక శక్తిగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదని తెలిపారు.
Read Also: Telangana Cabinet: రేపు కేబినెట్ విస్తరణ.. పట్నం మహేందర్‌రెడ్డికి చోటు..!
రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ వృద్ధి ఇంజిన్ గా మారుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరం లీడర్స్ డైలాగ్ లో మోడీ మాట్లాడుతూ దేశ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని వ్యాపారులను ఆహ్వానించారు. డిజిటల్ చెల్లింపుల రంగంలో భారత్ సాధించిన పురోగతి గురించి ప్రస్తావిస్తూ, బ్రిక్స్ కోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ను ఉపయోగించడానికి అనేక అవకాశాలు ఉన్నాయని మోడీ పేర్కొన్నారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) దేశాలు కలిసి ప్రపంచ సంక్షేమానికి దోహదం చేయగలవని తెలిపారు. దేశం విపత్తులను, కష్టాలను ఆర్థిక పునరుద్ధరణకు అవకాశాలుగా మార్చుకుందని అన్నారు. ఇండియాలో తాము చేసిన సంస్కరణల ఫలితంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నిరంతరం మెరుగుపడిందన్నారు. సామాజిక, ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి సాంకేతిక ఆధారిత పరిష్కారాలతో సహా చేపట్టిన సంస్కరణలు, రెడ్ టేప్ ను తొలగించడం ద్వారా రెడ్ కార్పెట్ ను అమలు చేస్తోందని తెలిపారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), దివాలా చట్టం అమలుతో ఇన్వెస్టర్ల విశ్వాసం పెరిగిందనీ, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని భారత ప్రజలు ప్రతిజ్ఞ చేశారని ప్రధాని పేర్కొన్నారు. భారత అభివృద్ధి ప్రయాణంలో చేరాలని వ్యాపారాలను ఆహ్వానించిన ప్రధాని.. రక్షణ, అంతరిక్షం వంటి రంగాలలోనూ ప్రైవేట్ పెట్టుబడులకు తెరలేపిందని తెలిపారు. లాజిస్టిక్స్ ఖర్చు తగ్గడం వల్ల తయారీ రంగం పోటీగా మారుతోందన్నారు. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి రంగాల్లో భారత్ ను గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో ఆర్థిక సమ్మిళితం దిశగా భారత్ పెద్ద ముందడుగు వేసిందన్న ప్రధాని.. గ్రామీణ మహిళలు ఎక్కువ ప్రయోజనం పొందారని తెలిపారు. సింగపూర్, ఫ్రాన్స్ వంటి దేశాలు యూపీఐ ప్లాట్ ఫామ్ లో చేరుతున్నాయనీ, బ్రిక్స్ దేశాలతో కూడా దీనిపై పనిచేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయని మోడీ చెప్పారు.