Joe Biden: గత 20 రోజులుగా ఇజ్రాయిల్-హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడిని హమాస్ ఉగ్రవాదాలు దారుణమైన ఊచకోతకు పాల్పడ్దారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాపై వైమానికి దాడులు నిర్వహిస్తోంది. అయితే పటిష్టమైన నిఘా వ్యవస్థ, మొస్సాద్ వంటి వ్యవస్థలు ఉన్నా కూడా ఇజ్రాయిల్, పొరుగున పాలస్తీనా గాజా నుంచి ఎదురయ్యే దాడిని కనిపెట్టలేకపోయింది.
ఇదిలా ఉంటే ఇజ్రాయిల్‌పై హమాస్ దాడికి ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్(IMEC) కారణమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం ఆరోపించారు. హమాస్ దాడికి ఈ కారిడార్ కూడా ఒక కారణమని నేను నమ్ముతున్నానని, దీనికి నా దగ్గర ఎలాంటి రుజువలు లేవు, నా ప్రవృత్తి నాకు చెబుతోంది, ఈ ప్రాంతంలో ఇజ్రాయిల్ మరింతగా దగ్గర అవుతుండటం, ఈ ప్రాంత సమైక్యత కోసం పురోగతి సాధిస్తున్న క్రమంలో ఈ దాడి జరిగిందని, మేము ఈ పనిని వదిలి పెట్టమని బైడెన్ చెప్పారు.
Read Also: Israel-Hamas War: గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయిల్ యుద్ధ ట్యాంకులు.. భూతల దాడికి అంతా సిద్ధం..
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్‌తో జాయింట్ మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన జీ20 సమావేశంలో ‘‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్’’పై భారత్, యూఎస్ఏ, యూఏఈ, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ ఈ ఒప్పందంపై ఎంఓయూ కుదుర్చుకున్నాయి.
ఈ కారిడార్ వల్ల ఇండియా, పశ్చిమాసియా, మధ్యప్రాచ్యం, యూరప్ మధ్య మెరుగైన కనెక్టివిటీ ఏర్పడుతుంది. దీంట్లో భాగంగా భారీ ఓడరేవులు, రోడ్డు, రైలు మార్గాలతో అరబ్, మిడిల్ ఈస్ట్ దేశాలను ఇజ్రాయిల్, యూరప్, ఇండియాలను కనెక్ట్ చేయవచ్చు. భారతదేశం ద్వారా ఆగ్నేయాసియా దేశాలకు వస్తువులు, సేవల్ని సులభంగా ఎగుమతి చేయవచ్చు. చైనా ‘ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ)’కి వ్యతిరేకంగా ఈ ప్రాజెక్టు కీలకం అవుతుందని యూరప్, అమెరికా, ఇజ్రాయిల్, సౌదీ, యూఏఈ వంటి దేశాలు భావిస్తున్నాయి.