నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్ష అనుభవాలు పంచుకున్నారు. వారం రోజుల అంతరిక్ష పర్యటనకు వెళ్లిన సునీతా.. సాంకేతిక లోపం కారణంగా దాదాపు 9 నెలలు స్పేస్‌లోనే ఉండిపోవల్సి వచ్చింది. ఎట్టకేలకు ఇటీవల పుడమిని ముద్దాడారు. తాజాగా బాహ్య ప్రపంచం ముందుకు వచ్చిన ఆమె.. అంతరిక్ష పర్యటన అనుభవాలు మీడియాతో పంచుకున్నారు. భారత్ ఏ విధంగా కనిపించిందంటూ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. భారతదేశ ప్రకృతి దృశ్యాన్ని చూసి ముగ్ధురాలైనట్లు తెలిపింది. భారత్ అద్భుతం.. మహా అద్భుతంగా ఉందంటూ కీర్తించారు. ఇక హిమాలయాలను దాటుకుని వెళ్తుండగా చాలా బాగుందని.. ఆ దృశ్యాలను బుచ్ విల్మోర్ కెమెరాలో బంధించినట్లు చెప్పారు. ఇక గుజరాత్, ముంబై ప్రాంతాల మీదగా వెళ్లినప్పుడు జాలర్ల పడవలు సిగ్నల్‌లాగా కనిపించాయని పేర్కొన్నారు.
భారత్‌లో పర్యటించే అవకాశాలపై ప్రశ్నించగా.. తన తండ్రి పుట్టిన దేశాన్ని త్వరలోనే చూస్తానని.. బంధువులు, ప్రజలతో అంతరిక్ష అనుభవాలను పంచుకుంటానని తెలిపారు. భారత్ అద్భుతమైన ప్రజాస్వామ్య దేశమని కొనియాడారు.
ఇక భారత్ అంతరిక్ష యాత్రకు సహాయం చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఏదొక సమయంలో కలుసుకుని భారత్‌తో అనుభవాలు పంచుకుంటానని చెప్పారు. భారత్ గొప్ప దేశం.. ప్రజాస్వామ్య దేశం.. భారత్ కూడా అంతరిక్ష యాత్ర చేపట్టడానికి ప్రయత్నిస్తోంది.. ఆ కార్యక్రమంలో భాగం కావడానికి.. సాయం చేయడానికి ఇష్టపడుతున్నట్లు వెల్లడించారు.
జూన్‌లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎనిమిది రోజుల యాత్ర కోసం బోయింగ్ స్టార్‌లైనర్‌లో అంతరిక్ష కేంద్రానికి బయల్దేరి వెళ్లారు. ప్రొపల్షన్ సమస్యల కారణంగా అంతరిక్ష నౌక.. సిబ్బంది లేకుండానే తిరిగి వచ్చింది. దీంతో ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలో చిక్కుకున్నారు. చివరికి మార్చి 19న స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా భూమికి తిరిగి చేరుకున్నారు.
ఇది కూడా చదవండి: Pati Patni Aur Woh : శ్రీలీల బాలీవుడ్ అఫర్ ను లాగేసుకున్న నేపో డాటర్