Thieves attack Hindu temple in USA: హిందూ ఆలయాలపై విదేశాల్లో దాడులు ఆగడం లేదు. ఇటీవల వారం వ్యవధిలో ఆస్ట్రేలియాలో రెండు దేవాలయాలపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడులు చేశారు. అంతకు ముందు బ్రిటన్, కెనడా దేశాల్లో కూడా ఇలాగే హిందూ దేవాలయాలపై దుండగులు దాడులు చేసిన సంఘటనలు చూశాం. తాజాగా అమెరికాలో ఓ హిందూ దేవాలయంపై దొంగలు దాడి చేసి ఆలయంలోని విలువైన వస్తువులను దోపిడి చేశారు.
Read Also: Krishna Janmabhoomi Case: కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదం.. ఈ నెల 25కు విచారణ వాయిదా
ఈ ఘటన జనవరి 11న టెక్సాస్ రాష్ట్రంలోని బ్రజోస్ వ్యాలీలోని శ్రీ ఓంకారనాథ్ ఆలయంలో జరిగినట్లు శుక్రవారం తెలిసింది. ఈ ఘటనపై స్థానిక హిందూ కమ్యూనిటీ భయాందోళన వ్యక్తం చేసింది. టెంపుల్ బోర్డు సభ్యుడు శ్రీనివాస్ సుంకరి మాట్లాడుతూ.. ఇది మాకు దండయాత్రలా ఉందని అన్నారు. బ్రజోస్ వ్యాలీలో ఉన్న ఏకైక హిందూ దేవాలయం ఇదే అని.. స్థానిక హిందువులు ఆలయంలో పూజలు చేస్తారని అన్నారు.
దొంగలు కిటికీ నుంచి లోపలికి ప్రవేశించి హుండీని, విలువైన వస్తువులు ఉంచే సేఫ్ ను దొంగిలించనట్లు వెల్లడించారు. దేవాలయం వెనక ఉండే పూజారి అతని కుటుంబం సురక్షితంగా ఉందని ఆయన వెల్లడించారు. ఆలయంలో ఉన్న సెక్యూరిటీ కెమెరాలను పరిశీలిస్తే.. దేవాలయం అనే గౌరవం లేకుండా ఓ వ్యక్తి విరాళాలు ఉండే బాక్సు వద్దకు వెళ్తున్నట్లు గమనించామన శ్రీనివాస్ సుంకరి తెలిపారు. దేవాలయానికి మరింత భద్రత పెంచాలని హిందూ సంఘం ఆదివారం జరిగిన సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ దోపిడిపై బ్రజోస్ కౌంటీ షెరీఫ్ దర్యాప్తు చేస్తోంది.