Benjamin Netanyahu: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో ఇరాన్ మద్దతు ఉన్న లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా ఈ యుద్ధంలోకి ప్రవేశిస్తుందనే వార్తలు వస్తున్నాయి. హమాస్‌కి మద్దతుగా ఇప్పటికే ఇజ్రాయిల్ ఉత్తర ప్రాంత సరిహద్దుపై లెబనాన్ నుంచి హిజ్బుల్లా దాడులు చేస్తోంది. దీంతో ఇజ్రాయిల్ టూ ఫ్రంట్ వార్ చేస్తోంది. ఇప్పటికే సరిహద్దుల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేసింది.
మరోవైపు ఇజ్రాయిల్ ఆర్మీ, రక్షణ శాఖ మంత్రి ఇప్పటికే హిజ్బుల్లాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒక వేళ ఇజ్రాయిల్ పై యుద్ధానికి వస్తే హిజ్బుల్లా మూల్యం చెల్లించుకోవాల్సిందే అని, ఇందులోకి లెబనాన్ ని లాగొద్దని హెచ్చరించింది. లెబనాన్ శ్రేయస్సు, సార్వభౌమత్వాన్ని దృష్టిలో పెట్టుకోవాలని లెబనీస్ లీడర్లకు వార్నింగ్ ఇచ్చింది.
Read Also: IND vs NZ: న్యూజిలాండ్తో మ్యాచ్ తర్వాత టీమిండియా ఆటగాళ్లు ఏడ్చేశారు
ఇదిలా ఉంటే తాజాగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, హిజ్బుల్లాకు హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ ఇజ్రాయిల్‌తో యుద్ధానికి దిగితే దాని జీవితంలో పెద్ద పొరపాటు చేసినట్లు అవుతుందని అన్నారు. ఊహించలేని శక్తితో ఎదుర్కొంటామని, లెబనాన్ వినాశనమవుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఉత్తర సరిహద్దు దళాలను సందర్శించి వారితో మాట్లాడుతూ నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై జరిపిన దాడి తర్వాత ఈ యుద్ధాన్ని ‘డూ ఆర్ డై’గా నెతన్యాహు అన్నారు.
అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్ల ఇజ్రాయిల్ పై దాడి చేసి 1400 మందిని హతమార్చారు. ఈ దాడి తర్వాత ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై భీకరదాడులు చేస్తోంది. హమాస్ ఉగ్రవాదులను మట్టుపెడుతోంది. అయితే ఈ దాడుల వల్ల గాజాలో 4500 మంది చనిపోయారు.