Hezbollah: హెజ్బొల్లాకు చెందిన మరో కీలక నేతను ఇజ్రాయెల్ సైన్యం మట్టుబెట్టింది. లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హెజ్బొల్లా మీడియా వ్యవహారాల బాధ్యతలు నిర్వహించే ప్రధాన ప్రతినిధి మహమ్మద్ అఫిఫ్ చనిపోయాడు. ఈ విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వార్తా సంస్థ తెలిపింది. ఆ తర్వాత హెజ్బొల్లా కూడా ధృవీకరించింది. అయితే, సెంట్రల్ బీరుట్‌లోని సిరియన్ బాత్ పార్టీ ప్రధాన కార్యాలయంపై IDF దాడిలో అఫీఫ్ మరణించినట్లు వెల్లడించింది.
Read Also: Manipur: మణిపూర్‌లో ఉద్రిక్తత.. బీజేపీ ప్రభుత్వానికి ఎన్‌పీపీ మద్దతు ఉపసంహరణ
కాగా, సెంట్రల్ బీరుట్‌పై టెల్అవీవ్ సేనలు ఇటీవల కాలంలో దాడి చేయడం ఇదే తొలిసారి. అయితే, ఇప్పటికే హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను హతమార్చడం లాంటి పరిణామాల నేపథ్యంలో ఆ సంస్థ మీడియా వ్యవహార బాధ్యతలు నిర్వహిస్తున్న మహమ్మద్ అఫిఫ్ బాహ్య ప్రపంచంలో ఎక్కువగా సంచరిస్తున్నాడు. అది గమనించిన ఇజ్రాయెల్ అతడ్ని హతమర్చేసింది. ఇక, హెజ్బొల్లా మిలిటెంట్లకు బలమైన స్థావరంగా ఉన్న బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలపైనా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. లెబనాన్ అధికారులు అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ప్రతిపాదనను పరిశీలిస్తున్న సమయంలో ఈ దాడులు జరిగాయి. మరో వైపు గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 12 మంది మరణించినట్లు పాలస్తీనా వైద్యాధికారులు పేర్కొన్నారు.