Health At The Mercy Of Fossil Fuels: కరోనా వైరస్ కారణంగా ప్రపంచదేశాలు ఎలా వణికిపోయాయో అందరికీ తెలుసు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఆర్థిక సంక్షోభంతో చాలా దేశాలు అల్లాడిపోయాయి. ఇప్పటికీ ఈ వైరస్ ప్రభావం కొన్ని దేశాలపై ఉంది. అయితే.. ఈ వైరస్‌కి మించిన మరో విపత్తు, ప్రాణాలను హరిస్తోందని ఓ పరిశోధనలో తేలింది. బొగ్గు, చముకు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాలను విపరీతంగా వాడుతుండటంతో.. గ్లోబల వార్మింగ్ పెరిగిపోయి, లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని వెలుగులోకి వచ్చింది. ఒక్క భారత్‌లోనే 2 నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారని ‘ద లాన్సెట్ కౌంట్‌డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్’ అనే నివేదిక వెల్లడించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ వంటి 50 సంస్థలకు చెందిన 99 మంది నిపుణులు కలిసి ఈ నివేదనకు రూపొందించారు. పరిస్థితులు ఇప్పుడే ఇంత ఘోరంగా ఉంటే, రానున్న రోజుల్లో మరింత తీవ్ర పరిణామాలు తప్పవని ఆ నివేదిక హెచ్చరిస్తోంది. మరి, ఈ పరిస్థితిని అదుపు చేయాలంటే ఎలా? శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలని ఆ నివేదిక సూచిస్తోంది. అలాగే.. ఆరోగ్య కార్యక్రమాలపై మరింత దృష్టిపెట్టాలని ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు సలహా ఇస్తున్నారు. అలా కాకుండా శిలాజ ఇంధనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే మాత్రం.. ఆహార భద్రత, అంటు వ్యాధుల వ్యాప్తి, ఉష్ణోగ్రత వల్ల కలిగే వ్యాధులు, విద్యుత్తు సంక్షోభం, గాలి కాలుష్యం వంటివి విపరీతంగా పెరిగిపోయి, మహా విపత్తు తలెత్తుతుందని హెచ్చరిస్తున్నారు. అప్పుడు మరణాల రేటు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి.. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే వినాశనం తప్పదని చెప్తున్నారు.
ఈ శిలాజ ఇంధనాల వాడకం వల్ల ఏర్పడే కాలుష్యం కారణంగా.. గతేడాదిలో భారత్‌లో 3,30,000 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ నివేదిక వెల్లడించింది. దాన్ని బట్టి.. ప్రతి 2 నిమిషాలకు 1.2 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. గతేడాదిలోనే చైనాలో 3,80,000 మరణాలు సంభవించగా.. ఐరోపాలో 1,17,000 మంది, అమెరికాలో 32 వేల మంది మరణించారు. ఈ శతాబ్దం చివరి నాటికి గ్లోబల్ వార్మింగ్ 2.7 డిగ్రీల సెల్సియస్ పెరగనుందని.. ప్రస్తుతం 1.1 డిగ్రీ సెల్సియస్ ఉన్నందుకే ప్రపంచం అతలాకుతలమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ దేశాలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈ సమస్యని గాలికొదిలేస్తే మాత్రం.. గ్లోబల్ వార్మింగ్ మరింత పెరిగి, దారుణమైన పరిస్థితుల్ని చవిచూడాల్సి వస్తుందంటున్నారు. శిలాజ ఇంధనాలకు రాయితీలు ఇవ్వడం తగ్గించాలని సూచిస్తున్నారు.