Israel-Hamas War: హమాస్ ఉగ్రవాదులు తమపై చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటోంది ఇజ్రాయిల్. ఒక్కొక్కరిగా హమాస్ మిలిటెంట్లను, వారి కీలక నాయకులను హతమారుస్తోంది. తాజాగా మరోసారి హమాస్‌ని దెబ్బకొట్టింది ఇజ్రాయిల్. తాజాగా హమాస్ నౌకాదళ కమాండర్ రలేబ్ అబూ సాహిబాన్ ను లక్ష్యంగా చేసుకుని రాత్రిపూట ఇజ్రాయిల్ వైమానిక దాడుల చేసింది. ఈ దాడుల్లో అతన్ని చంపినట్లు శనివారం ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ప్రకటించింది.
అక్టోబర్ 24న సముద్రం గుండా హమాస్ చొరబాటు ప్రయత్నాలకు ప్లాన్ చేయడంతో పాటు నాయకత్వం వహించాడని ఇజ్రాయిల్ ఆరోపించింది. ఇందుకు ప్రతిస్పందనగానే దాడులు నిర్వహించినట్లు ఐడీఎఫ్ తెలిపింది. హమాస్ దాడిని ఐడీఎఫ్ బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. నేవీ, ఎయిర్ ఫోర్స్, అమ్మన్, షిన్ బెట్ సంయుక్తం గూఢాచార ప్రయత్నాల్లో భాగంగా గాజా బ్రిగేడ్ నావికా దళ కామాండర్ రతాబ్ అబు తైబాన్ ను చంపేసినట్లు పేర్కొంది.
Read Also: Turkey: “వెంటనే ఆ పిచ్చిని ఆపేయండి”.. ఇజ్రాయిల్ దాడులపై టర్కీ అధ్యక్షుడు.
దీనికి ముందు హమాస్ వైమానిక విభాగానికి అధిపతిగా ఉన్న ఇస్సామ్ అబు రుక్బేని కూడా రాత్రిపూట జరిగిన వైమానిక దాడుల్లో చంపేసినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. హమాస్ కి సంబంధించి డ్రోన్లు, మానవరహిత వైమానిక విమానాలు, పారాగ్లైడర్లు, ఏరియల్ డిటెక్షన్ సిస్టమ్స్, ఎయిర్ డిఫెన్స్ పర్యవేక్షించే బాధ్యతను అబూ రక్బే చూస్తున్నాడు.
అక్టోబర్ 7న పారాగ్లైడర్ల ద్వారా హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ లోకి ప్రవేశించడం, ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్స అబ్జర్వేషన్ పోస్టులపై డ్రోన్ దాడులు చేయడంతో అబూ రుక్బే ప్రధాన పాత్ర పోషించాడు. అంతకుముందు అక్టోబర్ 14న హమాస్ వైమానిక దళాలకు చీఫ్ గా ఉన్న మురాద్ అబు మురాద్ ను ఐడీఎఫ్ చంపేసింది.
అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 1400 మంది ఇజ్రాయిలీలు మరణించారు. ఇజ్రాయిల్ గాజాపై జరిపిన దాడుల్లో 7000 మంది మరణించారు. అయితే గాజాలోని హమాస్ ను పూర్తిగా తుదముట్టించేందుకు ఇజ్రాయిల్ భూతల దాడులను కూడా ప్రారంభించింది. ఓ వైపు వైమానిక దాడులు చేస్తూనే.. మరో వైపు భూతల దాడులు చేస్తోంది.