శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి తాజాగా రాజకీయ సంక్షోభం తోడైంది. ప్రజాగ్రహం నేపథ్యంలో ఆదివారం క్యాబినెట్ మంత్రులందరూ మూకుమ్మడి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన మంత్రుల్లో ప్రధాన మంత్రి కొడుకు నమల్ రాజపక్స కూడా ఉన్నారు. దేశంలో రాజకీయ సుస్థిరతకు తన రాజీనామా తోడ్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే ప్రధాని మహింద్రా రాజపక్స మాత్రం రాజీనామా చేయలేదు. మరోవైపు శ్రీలంక సెంట్రల్ బ్యాంకు గవర్నర్ కూడా తన పదవికి రాజీనామా చేశారు.
ప్రధాని మహింద్రా రాజపక్సతో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా తమ పదవులకు రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలులో ఉంది. కర్ఫ్యూతో పాటు సోషల్ మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. 1948లో స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఇంత దారుణమైన సంక్షోభాన్ని శ్రీలంక ఇప్పటి వరకు చూడలేదు.
రాజకీయ సంక్షోభం ముదురటంతో అధ్యక్షుడు గోటబాయ రాజపక్స అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. సంక్షోభ పరిష్కారానికి అన్ని పార్టీలు కలిసి రావాలని అధ్యక్షుడు పిలుపు ఇచ్చారు. కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో భాగంగా ఆయన ప్రతిపక్ష పార్టీలకు లేఖలు రాశారు. మంత్రివర్గంలో చేరాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ప్రతిపక్షాలు మంత్రివర్గంలో చేరి కోరి కోరి ప్రజాగ్రహానికి గురికావాలని అనుకుంటాయా?
మరోవైపు తాజాగా నలుగురు కొత్త మంత్రులను నియమించినట్టు శ్రీలంక అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. పూర్తి క్యాబినెట్ కొలువుదీరే వరకు పార్లమెంటు కార్యక్రమాలు స్తంభించకుండా ఉండేందుకు వారిని నియమించినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది.
గురువారం రాత్రి అధ్యక్ష భవనం ఎదుట నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారడంతో దేశ వ్యాప్తంగా అది మరింత దిగజారకుండా శుక్రవారం ఉదయం దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలకు రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, అత్యవసర సరకులు, సేవల నిర్వహణ కోసం ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో పేర్కొంది. వాస్తవానికి, ఎమర్జెన్సీ విధింపునకు ముందే పలుచోట్ల నిరసన కారులను అదుపు చేసేందుకు కర్ఫ్యూ అమలులో ఉంది.
ఇదిలా ఉంటే.. ఆర్థిక సంక్షోభం కారణంగా దేశంలో నిత్యావసరాలు కొరత తీవ్రరూపం దాల్చటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆహారం, మందులు, చమురు ధరలు భయంకరంగా పెరిగిపోయాయి. కనీసం బిడ్డకు పాలు కూడా కొనలేనంతగా పరిస్థితులు దిగజారాయి. విదేశీ మారక ద్రవ్యం కొరతతో చమురు దిగుమతులకు చెల్లింపులు జరపలేని దుస్థితి నెలకొంది.
దేశంలో రోజుకు ఏకంగా 13 గంటల విద్యుత్ కోతలు విధిస్తున్నారు. దాంతో ప్రజలు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. జనజీవనం అస్తవ్యస్తంగా మారటంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ అందరూ రాజీనామా చేయాలంటూ జనం వీధుల్లోకి వచ్చారు. కొందరు నిరసనకారులు గురువారం రాత్రి అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. దాంతో అది హింసాత్మకంగా మారింది.
దేశంలో రాజపక్స ప్రజాదరణ తగ్గిందనటానికి ప్రస్తుత ప్రజాగ్రహమే నిదర్శనం. స్థిరమైన పాలన అందిస్తానంటూ 2019లోఅత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఆయన తరువాత విపరీతమైన బంధుప్రీతిని ప్రదర్శించారు. మంత్రి వర్గాన్ని కుటుంబ సభ్యులతో నింపి వేశారు. పలు కీలక శాఖలను సోదరులు, మేనల్లుడికి అప్పగించారు. దాంతో పాలన పూర్తిగా అవినీతిమయమైంది.
ఓ వైపు జనం కరెంటు లేక జనం నరకయాతన అనుభవిస్తుంటే.. మరోవైపు అధ్యక్షుడు, మంత్రుల నివాసాలు 24 గంటల కరెంట్ సరఫరాతో వెలిగిపోతున్నాయి. జనం తిండిలేక చస్తుంటే పాలకులు దర్జా ప్రదర్శిస్తున్నారు. దాంతో ప్రజలు కోపంతో ఊగిపోతున్నారు. ఆంక్షలను సైతం లెక్క చేయకుండా వీధుల్లోకి వస్తున్నారు.
అయితే.. ఈ సంక్షోభానికి కారణం అవినీతి కాదని.. కరోనా మూలంగానే పరిస్థితి తలకిందులైందని ప్రభుత్వం వాదిస్తోంది. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. కరోనా మూలంగా విదేశీ పర్యటకుల రాక పూర్తిగా తగ్గింది. శ్రీలంక విదేశీ ఆదాయానికి ప్రధాన వనరు పర్యటక రంగమే. కరోనా మహమ్మావరి వల్ల శ్రీలం టూరిజం పూర్తిగ్గా దెబ్బతింది. ఐతే కరోనా ఈ సవాళ్లను అధిగమించటంలో రాజపక్స ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించమే ఈ దుస్థితికి కారణమని విశ్లేషకులు అంటున్నారు.
వాస్తవానికి శ్రీలంక తాజా దుస్థితికి కారణం గడచిన రెండు మూడేళ్లు మాత్రమే కాదు. 20 ఏళ్లుగా అక్కడి ప్రభుత్వాల నిర్లక్ష్యంఆ దేశం దివాళా తీసేలా చేసింది. 2009లో అంతర్యుద్ధం ముగిసిన తరువాత గ్లోబల్ ఎకానమీతో కలవకుండా శ్రీలంక తప్పు చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నాడు శ్రీలంక ఆర్థిక వృద్ధి రేటు 9 శాతం వరకు ఉంది. 2000ల సంవత్సరంలో జీడీపీలో 33 శాతంగా ఉన్న ఎగుమతులు ఇప్పుడు 12 శాతానికి పడిపోయాయి. శ్రీలంక రూపాయి విలువ తగ్గించడానికి ప్రభుత్వం నిరాకరించడం కూడా దేశంలో విదేశీ నిల్వలు తగ్గడానికి కారణమైందని అభిప్రాయపడుతున్నారు.
2019 చివరి నాటికి 7.6 బిలియన్ డాలర్లుగా ఉన్న శ్రీలంక విదేశీ నిల్వలు ఇప్పుడు 2.3 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. వీటిలో వినియోగానికి అవసరమయ్యేవి 300 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. దాంతో పరిస్థితులు ఇప్పుడే కుదుటపడే అవకాశ లేదు. ఎక్కువగా దిగుమతులపై ఆధారపడే శ్రీలంకలో స్థిరమైన విదేశీ మారక ప్రవాహం లేకపోవటమే దీనికి కారణం. అందుకే పరిస్థితులు ఇంకా దిగజారతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
అత్యవసర వనరులైన చమురు, విద్యుత్ వంటి వాటిని కొనడానికి కూడా శ్రీలంక వద్ద తగినన్ని డాలర్లు లేవు. విద్యుత్ బోర్డులు కోతలు విధించటానికి కారణం ఇదే. పోను పోను కోతల సమయం పెరగవచ్చు కూడా. ప్రస్తుతం 13 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు.. రాబోయే రోజుల్లో ఇది 16 గంటలకు పెరిగినా పెరగొచ్చు. విద్యుత్ కోతల కారణంగా లక్షలాది మంది ప్రజల దైనందిన వ్యవహారాలు, వ్యాపారాలు, చదువు ప్రభావితం అయ్యాయి. పెట్రోల్ బంకుల బయట, వంటగ్యాసు సిలిండర్ల కోసం గంటల పాటు ఎండలో ప్రజలు క్యూలల్లో బారులు తీరుతున్నారు. పెద్ద వయస్కులు క్యూలోనే కుప్పకూలిపోతున్న ఘటనలు జరుగుతున్నాయి.
మరోవైపు, ఈ సంక్షోభ సమయంలో సాయపడాలని శ్రీలంక విపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస ..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అభ్యర్థించారు. తమ మాతృ భూమిని కాపాడుకునేందుకు మోడీ వీలైనంత సహాయం చేయాలని ఆయన మీడియా ముఖంగా కోరారు. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతోన్న శ్రీలంకకు భారత్ తగిన విధంగా సాయం చేస్తూనే ఉంది. చమురు, ఆహార ధాన్యాలు, ఔషధాలతోపాటు అప్పులు కూడా ఇచ్చింది. ఐనా, శ్రీలంకలో పరిస్థితి మారలేదు. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్య నిధి -ఐఎంఎఫ్ సాయాన్ని కూడా శ్రీలంక కోరింది.
పాలకులు చేసిన తప్పులకు లంక ప్రజలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇది ఆ దేశ ప్రజలకు పరీక్షా సమయం. ఈ సంక్షోభం నుంచి శ్రీలంక ఎలా గట్టెక్కుతుందన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.