Elon Musk Responds On Creating Own Smartphone For Twitter: ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ దానికి మార్పులు, సరికొత్త హంగులు దిద్దే పనుల్లో నిగ్నమయ్యాడు. నిషేధించబడిన ఖాతాలను పునరుద్ధరించడం, ఫేక్ ఖతాల్ని తొలగించడం.. లాంటివి చేస్తున్నాడు. వెరిఫై ఖాతాల విషయంలోనూ మరిన్ని చేర్పులు చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఇలా ట్విటర్‌కు తనదైన మార్క్ ఉండేలా మస్క్ నిమగ్నమవ్వగా.. ఒక యూజర్ అతనికి ఓ వినూత్నమైన ప్రశ్న సంధించింది. దానికి మస్క్ కూడా ఆసక్తికరమైన సమాధానమే ఇచ్చాడు.
‘‘ఒకవేళ ట్విటర్ యాప్‌ను గూగూల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి తొలగిస్తే ఏం చేస్తారు? ట్విటర్‌ను నడిపేందుకు మరో కొత్త ఫోన్‌ని మార్కెట్లోకి తీసుకొస్తారా? అయినా.. అంతరిక్షంలోకి పంపేందుకు రాకెట్లు తయారు చేసే మస్క్‌కి, సెల్‌ఫోన్ తయారు చేయడం చేత కాదా?’’ అంటూ లిజ్ వీలర్ అనే ఓ యూజర్ ట్విటర్ మాధ్యమంగా ప్రశ్నించింది. ఇందుకు మస్క్ బదులిస్తూ.. ‘‘ట్విటర్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి తొలగించడమనేది జరగని పని. నేనైతే అది జరగదని కచ్ఛితంగా నమ్ముతున్నాను. ఒకవేళ అలా జరిగితే మాత్రం.. నేను మార్కెట్లోకి తప్పకుండా ప్రత్యామ్నాయ ఫోన్‌ని తీసుకొస్తాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. దీనిపై నథింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు కార్ల్‌పీ స్పందిస్తూ.. మస్క్ తదుపరి ఏం చేస్తారో చూడాలనుందన్న ఆసక్తిని వెల్లడించాడు.
ఇదిలావుండగా.. తమ ప్లాట్‌ఫామ్స్‌పై సబ్స్క్రిప్షన్ కలిగిన యాప్‌లపై గూగుల్, యాపిల్ సంస్థలు కొంత కమిషన్ తీసుకుంటాయి. ఇంతకుముందు ఆ కమిషన్ 30 శాతం ఉండగా, ఇప్పుడు దాన్ని 15 శాతానికి తగ్గించేశారు. అయితే.. దీన్ని గతంలో మస్క్ చాలాసార్లు విమర్శించాడు. దీనిని ‘ఇంటర్నెట్పై పన్ను’గా అభివర్ణించిన మస్క్.. ఉండవలసిన దానికంటే 10 రెట్లు ఎక్కువగా కమిషన్ లాగుతున్నారని వ్యాఖ్యానించాడు. ఆ విమర్శల్ని ఇప్పుడు ప్రముఖ టెక్ విశ్లేషకుడు మార్క్ గుర్మాన్ తెరమీదకి తీసుకొచ్చి.. ఒకవేళ మస్క్ గూగుల్, యాపిల్ పేమెంట్ స్ట్రక్చర్‌ని దాటవేయాలని చూస్తే.. ట్విటర్‌ను ఆ రెండు సంస్థలు తమ స్టోర్ నుంచి బ్యాన్ చేయొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు.