Ebola outbreak in Uganda: ఉగాండాలో ఎబోలా కలకలం రేపుతోంది. ఆ దేశంలో వరసగా ఎబోలా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా రాజధాని కంపాలాలో కొత్తగా 9 ఎబోలా కేసులు నమోదయ్యాయి. గత రెండు రోజుల్లో మొత్తం 14 కేసులు నమోదు అయ్యయని అక్కడి ఆరోగ్య మంత్రి సోమవారం తెలిపారు. సెప్టెంబర్ నెలలో సెంట్రల్ ఉగాండాలోని గ్రామీణ ప్రాంతంలో ఎబోలా వ్యాప్తి ప్రారంభం అయింది. ఈ నెలలో రాజధాని కంపాలాకు ఈ వ్యాధి వ్యాపించింది. 16 లక్షల జనాభా ఉంటే కంపాలాలో వ్యాధి వ్యాపిస్తుండటం అక్కడి ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. వైద్య చికిత్స కోసం కస్సాండా జిల్లా నుంచి కంపాలాకు వచ్చిన వ్యక్తి మరణించడం ద్వారా ఈ వ్యాధి వ్యాపించింది.
Read Also: Pakistan: ఇమ్రాన్ ఖాన్‌కు షాక్.. పిటిషన్ తిరస్కరించిన పాక్ హైకోర్టు.
ఆదివారం రాజధానిలో మొత్తం 9 ఎబోలా కేసులు నమోదు అయితే మరణించిన వ్యక్తికి సంబంధించిన కుటుంబంలో ఏడుగురికి ఈ వ్యాధి సోకింది. వీరంతా కంపాలాలోని మసనావు ప్రాంతానికి చెందిన వారిగా ఆరోగ్య మంత్రి జెన్ రూత్ అసెంగ్ తెలిపారు. ఉగాండా వాసులు అప్రమత్తంగా ఉండాలని.. వ్యాధి లక్షణాలతో ఎవరైనా ఉంటే వెంటనే తమకు రిపోర్ట్ చేయాల్సిందిగా మంత్రి ప్రజలను కోరారు. వ్యాధి లక్షణాలు ఉంటే బాధితులు ఐసోలేషన్ లోకి వెళ్లాలని అక్కడి ప్రభుత్వం ప్రజలకు సూచించింది.
ఎబోలా సోకిన వ్యక్తి శరీర ద్రవాల ద్వారా ఈ వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుంది. ప్రస్తుతం ఉగాండాలో ఎబోలా లక్షణాలు ఉన్న కేసుల్లో 90 శాతం కన్నా ఎక్కువ కేసులను ఎబోలాగా గుర్తించారు. వీటిలో 44 మరణాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉగాండాలో వ్యాపిస్తున్న ఎబోలా.. సూడాన్ జాతిగా గుర్తించారు. ఈ వ్యాధికి వ్యాక్సిన్ లేదు. ఉగాండాకు పొరుగున ఉన్న డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో జైర్ జాతి ఎబోలా వ్యాధి వ్యాపించింది. ఎబోలా వైరస్ సోకిన వారిలో సగం మంది మృత్యువాత పడే అవకాశం ఉంది. తీవ్రమైన బలహీనత, కండరాల నొప్పి, తలనొప్పి, గొంతునొప్పి, వాంతులు, విరేచనాలు ఎబోలా వ్యాధి లక్షణాలు.