Afghan-Pak War: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కుమ్ముకున్నాయి. కుర్రం జిల్లాలో పాకిస్తాన్ దళాలు, ఆఫ్ఘాన్ తాలిబాన్ల మధ్య మంగళవారం రాత్రి మరోసారి దాడులు ప్రతి దాడులు జరిగాయి. పాకిస్తాన్ ఆర్మీ తమ 23 మంది సైనికులు మరణించినట్లు, 200 మందికి పైగా తాలిబాన్లను చంపినట్లు చెప్పింది. ఇదిలా ఉంటే కాందహార్ ప్రావిన్సులోని స్పిల్ బోల్డాక్ జిల్లాలో పాకిస్తాన్ దళాలు దాడులకు తెగబడ్డాయి. ఈ దాడుల్లో 12 మంది ఆఫ్ఘాన్ సాధారణ పౌరులు మరణించారు. 100 మందికి పైగా గాయాలపాలయ్యారని తాలిబాన్ అధికారులు చెప్పారు. దీంతో ప్రతీకార దాడులు చేసి, పాకిస్తాన్ సైనిక స్థావరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆఫ్ఘన్ దళాలు ప్రకటించాయి.
Read Also: Tamil Nadu: హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. ఎన్నికల ముందు డీఎంకే “భాషా” సెంటిమెంట్
ఈ దాడులపై తాలిబాన్ అధికార ప్రతినిధి జబిబుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. పాక్ దళాలు సాధారణ పైరులపై దాడులు చేశాయని, ఆఫ్ఘాన్ దళాల ప్రతీకార చర్యలో అనేక మంది పాక్ సైనికులు మరణించినట్లు చెప్పారు. 12 మంది చనిపోయినట్లు ఆయన ట్వీట్ చేశారు. ప్రతీకార దాడిలో అనేక పాకిస్తాన్ పోస్టుల్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఈ వారంలో ఇరు వర్గాలు సరిహద్దు వెంబడి కాల్పులు జరుపుతుండటంతో డ్యూరాండ్ లైన్ వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనలో ఉన్న సమయంలోనే, పాకిస్తాన్ ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్‌పై వైమానిక దాడులు చేసింది. పాక్ తాలిబాన్ లీడర్ టార్గెట్‌గా దాడులు చేసినట్లు చెప్పింది. ఈ సంఘటన తర్వాత తాలిబాన్ దళాలు పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటున్నాయి.
