Donald Trump’s key comments on Elon Musk’s Twitter Takes Over: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ ను ఎట్టకేలకు సొంతం చేసుకున్నారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఊగిసలాటకు తెరదించారు. రావడం రావడంతోనే పలువురు కీలక ఉద్యోగులను తొలగించారు మస్క్. సీఈఓ పరాగ్ అగర్వాల్ తో పాటు, సీఎఫ్ఓ నెడ్ సెగల్, జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్జెట్, లీగల్ పాలసీ అధికారిని విజయగద్దెను తొలగించారు. ఇదిలా ఉంటే యూఎస్ఏ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలుపై స్పందించారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలును ట్రంప్ అభినందించారు.
ప్రపంచంలోనే నెంబర్ వన్ 1 సంపన్నుడు అయిన ఎలాన్ మస్క్ 44 బిలియన్ల డాలర్ల భారీ డీల్ తో గురువారం ట్విట్టర్ ను సొంతం చేసుకున్నారు. ‘ట్విట్టర్ ఇప్పుడు తెలివైన వాళ్ల చేతిలోకి వెళ్లిందని’ ట్రంప్ వ్యాఖ్యానించారు. దేశాన్ని ద్వేషించే రాడికల్ లెఫ్ట్ వెర్రివాళ్లు, ఉన్మాదులు ఇకపై ట్విట్టర్ ను నిర్వహించబోరని ఆయన తన సొంత ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. అయితే తనను నిషేధించిన ట్విట్టర్ లోకి మరోసారి రావాలనుకుంటున్నారా..? లేదా..? అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.
Read Also: NZ Vs SL: ఫిలిప్స్ వీరవిహారం.. టీ20 ప్రపంచకప్‌లో రెండో సెంచరీ
2021 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ మద్దతుదారులు యూఎస్ క్యాపిటల్ పై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ట్రంప్ పై ట్విట్టర్ నిషేధం విధించింది. ఆ సమయంలో ట్రంప్ తన మద్దతుదారులు దాడులకు పాల్పడేలా రెచ్చగొట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ట్విటర్ తన వశం అయితే ట్రంప్ పై నిషేధం ఎత్తేస్తానని గతంలో ఎలాన్ మస్క్ తెలిపారు. నేను లేకుండా ట్విట్టర్ విజయవంతం కాగలదని తాను అనుకోవడం లేదని ట్రంప్ అన్నారు. ట్విట్టర్ తనను నిషేధించడంతో ట్రంప్ సొంతంగా ఓ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ ట్రూత్ సోషల్’ ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి నాలుగు మిలియన్ల పైగా ఖాతాదారులు ఉన్నారు.