NTV Telugu Site icon

Israel-Hamas War: ఇజ్రాయిల్ ఆర్మీని ‘ఉగ్ర సంస్థ’గా గుర్తించాలి.. ముస్లిం దేశాలకు ఇరాన్ పిలుపు..

Iran

Iran

Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ఈ రోజు సౌదీ అరేబియా వేదికగా ఇస్లామిక్ దేశాలు సమావేశమయ్యాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేటివ్(ఓఐసీ) రియాద్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్, పాలస్తీనాపై జరుపుతున్న దాడిపై ఈ దేశాలు చర్చించాయి. గాజా స్ట్రిప్ లో ప్రస్తుత యుద్ధం గురించి మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ ఆర్మీని ‘‘ఉగ్రవాద సంస్థ’’గా ప్రకటించాలని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ శనివారం ఇతర ఇస్లామిక్ దేవఆలకు పిలుపునిచ్చారు.

Read Also: Israel-Hamas War: అంధకారంలో గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి.. మరణం అంచున శిశువులు..

హమాస్ ఉగ్రసంస్థపై ఇజ్రాయిల్ పోరు సాగిస్తున్న నేపథ్యంలో గాజాలో వేల సంఖ్యలో ప్రజలు చనిపోతుండటంపై ముస్లిం దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాల్పుల విరమణకు పిలుపునిస్తున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయిల్ తీరును ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది. అయితే ఉప్పు నిప్పులా ఉంటే ఇరాన్, సౌదీ దేశాలు ఈ యుద్ధం నేపథ్యంలో చర్చల్లో పాల్గొన్నాయి. మార్చి నెలలో ఇరు దేశాలు కూడా సంబంధాల్ని పునరుద్ధరించుకోవాలని అంగీకరించిన తర్వాత తొలిసారిగా ఇరాన్ అధ్యక్షుడు రైసీ, సౌదీకి వెళ్లారు. ఇజ్రాయిల్ తో సంబంధాలు ఉన్న దేశాలు వాటిని తెంచుకోవాలని ఇరాన్ సూచించింది. ఇస్లామిక్ దేశాలు జియోనిస్ట్ పాలన(ఇజ్రాయిల్)తో ఎలాంటి రాజకీయ, ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలని పిలుపునిచ్చింది. ఇంధన రంగంలో వాణిజ్య బహిష్కరణ అమలు చేయాలని రైసీ సూచించారు. ఇజ్రాయిల్‌కి మద్దతుగా వ్యవహరిస్తున్న అమెరికాపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ మాత్రం హమాస్, లెబనాన్ లోని హిజ్బుల్లా మిలిటెంట్లకు ఇరాన్ మద్దతు ఇస్తుందని, ఇరాన్ ప్రాక్సీలుగా ఇవి వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. అక్టోబర్7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై దాడి చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. హమాస్ దాడిలో 1400 మంది ఇజ్రాయిలీలు మరణించారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్‌పై దాడి చేస్తోంది. ఈ దాడుల్లో హమాస్ ఉగ్రవాదులతో సహా సాధారణ పాలస్తీనియన్లు మరణిస్తున్నారు. 11000 మంది చనిపోయారు.