Dengue outbreak In Pakistan: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్.. ప్రస్తుతం రోగాల బారినపడింది. అక్కడ ప్రజలు అనారోగ్య సమస్యలకు ఎదుర్కొంటున్నారు. భారీ వరదలు, వర్షాల కారణంగా అక్కడి ప్రజలు అంటువ్యాధులతో సతమతం అవుతున్నారు. తాజాగా పాకిస్తాన్ దేశం డెంగ్యూ కోరల్లో చిక్కుకుంది. దీనికి తోడు తీవ్ర మందుల కొరతను కూడా ఎదుర్కొంటోంది ఆ దేశం. పాకిస్తాన్ రాజధాని నగరం ఇస్లామాబాద్ లో గత 24 గంటల్లో 104 డెంగ్యూ కేసులు నమోదు అవ్వడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
Read Also: Salman Khan: గాడ్‌ఫాదర్‌కి సల్మాన్ రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే మైండ్‌బ్లాక్
పాకిస్తాన్ లో ఈ ఏడాది ఇప్పటి వరకు 30,267 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. ఇస్లామాబాద్ నగరంలో ఇప్పటి వరకు 2435 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. దాయాది దేశంలో డెంగ్యూ కారణంగా 68 మంది ప్రాణాలు కోల్పోయారు. సింధ్ ప్రావిన్సులో ఇప్పటి వరకు 9,496 డెంగ్యూ కేసులు నమోదు కాగా.. 37 మంది మరణించారు. పంజాబ్ ప్రావిన్సులో 6,564 డెంగ్యూ కేసులు నమోదు కాగా.. 18 మంది వైరస్ బారిన పడి మరణించారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో 8,070 కేసులు నమోదు కాగా.. ఏడుగురు మరణించారు, బలూచిస్తాన్ ప్రావిన్సులో 3,402 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి.
మరోవైపు ఇటీవల సంభవించిన వరదల కారణంగా బలూచిస్తాన్, సింధ్ ప్రావిన్సులు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో పాటు ఖైబర్ ప్రావిన్సుల్లో కూడా భారీ స్థాయిలో వరదలు సంభవించాయి. మూడింట ఒక వంతు పాక్ భూభాగం నీటితో నిండి ఉంది. వరదల కారణంగా చాలా మంది ప్రజలు కట్టుబట్టలతో మిగిలారు. అయితే వరదల కారణంగా ఆ దేశంలో అంటు వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి.