కాబూల్ బ్లాస్ట్ మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. తాజా నివేదికల ప్రకారం ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 150 దాటిందని తెలుస్తోంది. మరికొంత మంది ఆస్పత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇటు కాబూల్ ఎయిర్ పోర్టుకు ఉగ్రవాదుల నుంచి మరోసారి ముప్పు పొంచి ఉందని అమెరికా సహా అనేక దేశాలు హెచ్చరిస్తున్నాయి. ఇటు బాంబు దాడుల భయం ఉన్నా జనం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎయిర్ పోర్టు గుంపులు గుంపులుగా తరలి వస్తూనే ఉన్నారు. ఇటు, తీవ్ర భయాందోళనల మధ్య కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి విదేశీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అమెరికా ఇప్పటి వరకు 82 వేల మందిని తరలించినట్టు తెలుస్తోంది. ఇవాళ్టితో ఫ్రాన్స్, స్వీడన్, ఇటలీ తరలింపు ప్రక్రియను ముగించాయి. ఇటలీ పౌరులతో పాటు, మరో 4900 మంది అప్ఘానీలను కూడా తాము ఎయిర్ లిఫ్టి చేశామని ఇటలీ ప్రకటించింది.
ఇటు బాంబు దాడుల్లో గాయపడ్డ వారికి వైద్యసాయం చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాట్లు చేసింది. బాధితులకు కావాల్సిన మెడికల్ ఎక్విప్‌మెంట్‌ను కాబూల్‌కు తరలించింది. త్వరలోనే వైద్యుల బృందాన్ని కూడా కాబూల్‌కు తీసుకొస్తామని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఇటు ఎయిర్ పోర్టు బయట ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాలిబన్లు ఎయిర్ పోర్టు వెలుపలి ప్రదేశాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తగన డాక్యుమెంట్లు ఉన్నవారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. మరోవైపు ఎయిర్ పోర్టు దగ్గర దేశం విడిచి వెళ్లేందుకు ఎదురు చూస్తున్న వారిని స్థానిక వ్యాపారులు దోచుకుంటున్నారు. లీటర్ వాటర్ బాటిల్‌ను 44 డాలర్లకు అమ్ముతున్నారు. ఇది ఇండియన్ కరెన్సీ ప్రకారం మూడు వేల రూపాయలు. ప్లేటు భోజనం దొరకాలంటే కనీసం 100 డాలర్లు వెచ్చించాల్సి వస్తుంది.