Gaza War: హమాస్ అంతాన్ని చూసే దాకా ఇజ్రాయిల్ గాజాలో యుద్ధాన్ని ఆపేలా కనిపించడం లేదు. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని చంపేశారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ పాలస్తీనా భూభాగాలైన గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్‌పై విరుచుకుపడుతోంది. హమాస్ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. హమాస్ అంతమయ్యేదాకా యుద్ధాన్ని విరమించేంది లేదని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పలు సందర్భాల్లో వెల్లడించారు.
Read Also: Vijayashanthi: ఆయనకి కూడా ఇస్తే తెలుగు జాతి పులకించిపోయేది.. ‘భారతరత్న’పై విజయశాంతి కామెంట్స్
యుద్ధం కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. హమాస్ చేసిన నేరానికి సాధారణ పాలస్తీనా ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇప్పటి వరకు యుద్ధంలో 28,064 మంది మరణించారని గాజాలోని హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. గత 24 గంటల్లో 117 మంది మరణించినట్లు వెల్లడించింది. 67,611 మంది గాయపడ్డారు.
గతంలో ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంలో ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి ఏర్పడింది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ నుంచి కిడ్నాప్ చేసిన పౌరుల్లో కొంతమందిని హమాస్ విడుదల చేయగా.. అందుకు ప్రతిగా ఇజ్రాయిల్ తమ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్లను విడిచి పెట్టింది. మరికొంత మంది ఇజ్రాయిల్ బందీలు ఇంకా హమాస్ చెరలోనే ఉన్నారు. అయితే, మరోసారి సంధి కోసం పారిస్ వేదికగా ఖతార్ ప్రయత్నిస్తుందనే వార్తలు వస్తున్నాయి. గతంలో గాజాలోని ఉత్తర భాగాన్ని మాత్రమే టార్గెట్ చేసిన ఇజ్రాయిల్ ప్రస్తుతం దక్షిణ ప్రాంతంలో కూడా వరసగా హమాస్ లక్ష్యంగా దాడులు చేస్తోంది.