Iraq clashes: రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు మతపెద్ద ప్రకటించడంపై షియా మతపెద్ద ముక్తాదా అల్-సదర్ మద్దతుదారులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో మృతుల సంఖ్య 20కి చేరుకుందని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఇరాక్‌లో శక్తిమంతమైన నాయకుల్లో ఒకరిగా పేరున్న ముక్తాదా అల్ సదర్ రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం ప్రకటించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆయన మద్దతుదారులు పలు ప్రావిన్సుల్లో ప్రభుత్వం కార్యాలయాల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించగా.. భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో దాదాపు 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణల్లో 300 మందికి పైగా గాయపడ్డారు. ముక్తాదా అల్-సదర్ సోమవారం తన వేలాది మంది అనుచరులతో కలిసి ఇరాక్ అధ్యక్ష భవనంపై దాడి చేశారు. నిరసనకారుల హింస, ఆయుధాల వినియోగం ఆపే వరకు ముక్తాదా అల్-సదర్ నిరాహార దీక్షను ప్రకటించారు.
Abhijit Sen Passes Away: ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ కన్నుమూత
ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్ సైన్యం ఆ దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించింది. గత ఏడాది అక్టోబరులో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో అల్ సదర్ పార్టీ అత్యధిక సీట్లు సాధించింది. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజార్టీ మార్కును మాత్రం చేరుకోలేకపోయింది. ఆపై ఇతర పార్టీలతో కలిసి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేయడంలోనూ విఫలమైంది. దీనివల్ల కొన్ని నెలలుగా దేశ రాజకీయాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. గతంలో కూడా అల్ సదర్ పలు మార్లు రాజకీయాల నుంచి ప్రకటించి.. మళ్లీ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం తెలిసిందే. పరిస్థితిని అదుపుచేయడానికి, హింసను నివారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత వర్గాలను యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కోరారు. అన్ని పార్టీలు, వర్గాలు తమ విభేదాలకు అతీతంగా ఎదగాలని ఐక్యరాజ్యసమితి చీఫ్ గట్టిగా కోరుతున్నారని సెక్రటరీ జనరల్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ ప్రకటనలో తెలిపారు.