India – China Border Issue: డ్రాగన్ కంట్రీ ఇండియా సరిహద్దుల్లో కుట్రలు చేయడం మానడం లేదు. ఏదో విధంగా భారత్ ను ఇబ్బంది పెడుతామని చూస్తోంది. గతంలో గాల్వాన్ ప్రాంతంలో ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ లో చైనా దురాక్రమణను భారత సైన్యం ధీటుగా అడ్డుకుంది. ఇదిలా ఉంటే తాజాగా చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ భారత సరిహద్దులో చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) పోరాట సన్నద్ధతను పరిశీలించారు.
లడఖ్ సరిహద్దుల్లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉన్న చైనా సైనికులతో జిన్ పింగ్ వీడియో సంభాషణ నిర్వహించారు. వారి పోరాట సన్నద్ధతను పరిశీలించినట్లు చైనీస్ మీడియా వెల్లడించింది. జిన్జియాంగ్ మిలిటరీ కమాండ్ లోని ఖుంజేరాబ్ లోని సరిహద్దు రక్షణ పరిస్థితిపై పీపుల్ లిబరేషన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం నుంచి సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి, చైనా ఆర్మీ అధినేత అయిన జిన్ పింగ్ సైనికులతో సరిహద్దు పరిస్థితిని సమీక్షించారు. ఇటీవల సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది..? సైన్యంపై ప్రభావం ఎలా ఉందనే విషయాలను చర్చించినట్లు తెలిసింది. సరిహద్దుల్లో 24 గంటలు పర్యవేక్షిస్తున్నామని సైనికులు జిన్ పింగ్ కు తెలిపారు. సైనికుల సరిహద్దు రక్షణను జిన్ పింగ్ కొనియాడారు, మరింత సహకారాన్ని అందిస్తామని వెల్లడించారు.
తూర్పు లడఖ్ లోని పాంగాంగ్ త్సో సరస్సు, గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికులు మధ్య మే5, 2020న హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో ఇరు వైపుల సైనికులు మరణించారు. అయితే భారత్ కన్నా, చైనా సైనికులే అధికంగా చనిపోయారని పాశ్చాత్య మీడియా తెలిపింది. అయితే చైనా మాత్రం దీనిని అంగీకరించడం లేదు. ఈ ప్రతిష్టంభనతో ఇరు వర్గాల మధ్య 17 రౌండ్ల ఉన్నతస్థాయి సైనిక చర్చలు జరిగాయి.