Teeth Implants: దంతాల సర్జరీ ఒకరి ప్రాణాలను తీసింది. ఒకే రోజు ప్రమాదకరమైన రీతిలో ఈ సర్జరీ సాగడంతో రోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తూర్పు చైనాలోని జరిగింది. హువాంగ్ అనే ఇంటిపేరు కలిగిన వ్యక్తి ఆగస్టు 14న జెజియాంగ్ ప్రావిన్స్‌లోని జిన్హువాలోని యోంగ్ కాంగ్ దేవే డెంటల్ ఆస్పత్రిలో దంతాలకు సంబంధించిన ఒక ప్రొసీజర్ చేయించుకున్నాడు. ‘‘ఇమ్మిడియేట్ రిస్టోరేషన్’’ ప్రక్రియ ద్వారా ఒకే రోజు 23 దంతాలను తీసి, 12 ఇంప్లాంట్స్‌లను అమర్చారు. ఈ ప్రక్రియ జరిగిన రెండు వారాల తర్వాత అతను హఠాత్తుగా గుండెపోటుకు గురై మరణించారు. ఆగస్టు 28న అతను మరణించినట్లు ఆయన కుమార్తె షు ఆన్‌లైన్ పోస్ట్ ద్వారా ఈ కేసును వెలుగులోకి తెచ్చారు.
ఈ ప్రక్రియ తర్వాత తన తండ్రి దారుణమైన నిరంతర నొప్పిని అనుభవించినట్లు చెప్పారు. ‘‘మా నాన్న ఇంత త్వరగా చనిపోతాడని అనుకోలేదు. మేం కొనుకున్న కొత్త కారు కూడా అతడికి నడిపే అవకాశం రాలేదు’’ అని పోస్టులో అతడి కూతురు షు చెప్పింది. ఈ ఘటనపై యోంగ్‌కాంగ్ మున్సిపల్ హెల్త్ బ్యూరో నుంచి ఒక అధికారి సెప్టెంబర్ 3న స్పందించారు. డెంటర్ ప్రక్రియ, వ్యక్తి మరణానికి మధ్య 13 రోజుల గ్యాప్ ఉందని, మరణానికి కారణాలు ఇంకా దర్యాప్తు చేయబడుతున్నాయని చెప్పారు.
Read Also: Petrol: పెట్రోలియం శాఖ కీలక ప్రకటన.. వాహనదారులకు శుభవార్త అందే ఛాన్స్!
వుహాన్‌లోని హాస్పిటల్ ఆఫ్ యూనివర్సల్ లవ్‌లోని డెంటల్ మెడిసిన్ సెంటర్ డైరెక్టర్ జియాంగ్ గుయోలిన్ ప్రకారం, ఒకే విధానంలో తీయగల గరిష్ట సంఖ్యలో దంతాల తీసే విషయంలో అధికారిక మార్గదర్శకాలు ఏవీ లేవు. అయినప్పటికీ, సాధారణంగా, 10 పళ్ళును తీస్తుంటారు అని చెప్పారు. 23 దంతాలను ఒకే సారి తీయడం చాలా ఎక్కువ. దీనికి తగిన అర్హత, అనుభవం ఉన్న వైద్యుడు అవసరమని, అలాంటి విస్తృతమైన ప్రక్రియను నిర్వహించేటప్పుడు రోగి ఆరోగ్య సామర్థ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఆయన చెప్పారు.
ఈ కేసు గురించి తెలుసుకున్న నెటిజన్లు చాలా మంది సోషల్ మీడియాలో షాక్ అవుతున్నారు. ఒకే రోజులో 23 దంతాలను తీసే నిర్ణయాన్ని వారు ప్రశ్నించారు. దీనిపై మరో డెంటిస్ట్ స్పందిస్తూ.. ‘‘నేను దంతవైద్యుడిని, అవి చాలా వదులుగా ఉంటే తప్ప నేను ఒకేసారి మూడు దంతాల కంటే ఎక్కువ తీయను. డాక్టర్ కి మతిస్థిమితం తప్పింది. ఇది దంత ప్రక్రియ కంటే మానవ ప్రయోగంలా అనిపిస్తుంది.’’ అని అన్నారు.