మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ఇరుకైన సముద్ర మార్గం ‘‘హార్ముజ్ జలసంధి’’ని మూసేసింది. దీంతో ప్రపంచం మొత్తం చమురు సంక్షోభంలో చిక్కుకుంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఇరాన్ ప్రాక్సీ అయిన యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో అత్యంత కీలక సముద్ర మార్గమైన బాబ్ అల్-మండేబ్ (Bab el-Mandeb)లో క్రియాశీలకంగా మారారు. ఈ మార్గం గుండా నౌకా ప్రయాణాలను వీరు కంట్రోల్ చేయాలని చూస్తున్నారు.
అమెరికా, సౌదీ అరేబియాలు శత్రువులుగా భావించే హౌతీలతో ఇప్పుడు చైనా ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతల మధ్య తమ చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా హామీలు పొందడమే లక్ష్యంగా చైనా ఒప్పందానికి సిద్ధమైంది. జూలై 20న హౌతీలు బాబ్ అల్-మండేబ్ జలసంధిపై దిగ్బంధనాన్ని ప్రకటించిన తర్వాత ఆ మార్గంలో తమ నౌకలకు ఇబ్బందులు కలిగించొద్దని అనుమతి కోరిన తొలి దేశంగా చైనా మారింది.
ఈ ‘‘కన్నీటి ద్వారం’’ ఎందుకు అంత కీలకం..?
బాబ్ అల్-మండేబ్ జలసంధిని అరబిక్‌లో “కన్నీటి ద్వారం” అని కూడా పిలుస్తారు. ఇది ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ అడెన్‌తో కలుపుతూ, సూయజ్ కాలువ ద్వారా యూరప్‌లోకి వెళ్లేందుకు అత్యంత కీలమైన మార్గంగా ఉంది. ఈ మార్గం ద్వారా మధ్యప్రాచ్యం నుంచి చైనాకు భారీ స్థాయిలో చమురు, గ్యాస్ సరఫరా జరుగుతోంది. యూరప్, ఆఫ్రికా, ఆసియాల మధ్య వాణిజ్యంలో కీలకంగా మారింది.
ఈ మార్గం మూసుకుపోతే నౌకలు యూరప్ వెళ్లాలంటే దక్షిణాఫ్రికా లోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తిరిగి అత్యంత దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దీంతో ప్రయాణ, ఇంధన ఖర్చులు పెరుగుతాయి.
మరోవైపు, ఈ వ్యూహాత్మక మార్గాన్ని దృష్టిలో ఉంచుకుని ఆఫ్రికాలో జిబూటీలో చైనా తన సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ఈ స్థావరం ద్వారా ఎర్ర సముద్రంలో తన వాణిజ్య ప్రయోజనాలను, ఇంధన సరఫరాను పర్యవేక్షించే అవకాశం చైనాకు లభిస్తోంది.

