China: ఆధునిక సాకేంతికతను ఉపయోగించి నూతన ఆయుధాలను తయారు చేసే చైనా మరో కొత్త ఆయుధాన్ని తయారు చేసింది. ప్రపంచంలో అగ్ర రాజ్యాల్లో ఒకటిగా ఉన్న చైనా అటు ఆర్థిక రంగంతోపాటు.. ఇటు ఆయుధ రంగంలోనూ నంబర్ వన్‌గా ఉండాలని భావించే దేశం. అందులో భాగంగానే నూతన ఆయుధాల తయారీ చేపడుతుంటుంది. అయితే చైనా తయారు చేసిన కొత్త ఆయుధం గురించి అధికారికంగా చెప్పకపోయినప్పటికీ చైనా అంతర్గతంగా ఇప్పటికే ఆ ఆయుధాన్ని తయారు చేసినట్టు తెలుస్తోంది. ఈ సరికొత్త వ్యవస్థతో ఉపగ్రహాలను సైతం పేల్చే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఆగకుండా నిప్పులు చిమ్మగల సామర్థ్యం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో చైనా అమ్ములపొదిలో మరో కొత్త ఆయుధం చేరినట్టు అయింది. లేజర్ పరిజ్ఞానంలో సరికొత్త సాంకేతికతను చైనా అభివృద్ధి చేసింది. లేజర్ అయుధాలు వేడెక్కకుండా వాటిని చల్లబరిచే కొత్త కూలింగ్ వ్యవస్థను కనుగొంది.
Read also: Virat Kohli New House: 8 ఎకరాల్లో విరాట్ కోహ్లీ కొత్త ఇల్లు.. క్రికెట్ పిచ్ కూడా!
కొత్త కూలింగ్ వ్యవస్థతో ఇక లేజర్ ఆయుధాలు.. నిరవధికంగా కాల్పులు జరిపే సామర్థ్యం సొంతం చేసుకోనున్నాయని.. రోదసిలో తిరిగే ఉపగ్రహాలనూ వీటితో కూల్చేయవచ్చని.. ఈ లేజర్ నిర్విరామంగా ఎంత దూరమైనా ప్రయాణిస్తుందని.. ఇది భవిష్యత్తు యుద్ధరంగ తీరుతెన్నులను పూర్తిగా మార్చేస్తుందని చైనా దేశ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చైనాలోని చెంగ్డూలోని ‘నేషనల్ డిఫెన్స్ టెక్నాలజీ’ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు. ఈ కూలింగ్ సిస్టమ్ హైఎనర్జీ లేజర్‌కు వేడెక్కకుండానే శక్తిని అందిస్తుందని శాస్ర్తవేత్తలు పేర్కొంటున్నారు. ఇది ఒక విప్లవాత్మక పరిణామం అని నేషనల్ డిఫెన్స్ టెక్నాలజీ శాస్త్రవేత్త యువాన్ షెంగ్ఫూ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆగస్టు 4న ‘ఆక్టా ఆప్టిక్ సినికా’ అనే చైనా జర్నల్‌లో ఓ పరిశోధనా పత్రాన్ని ప్రచురించారు. వాస్తవానికి లేజర్ ఆయుధాలు వినియోగించే సమయంలో పుట్టుకొచ్చే ఉష్ణం పెద్ద సమస్యగా ఉంటుందన్నారు. అయితే ఇది పలు సాంకేతిక సమస్యలకు కూడా కారణమవుతోందని చెప్పారు. ఇప్పటికే అమెరికా హైగ్రేడ్ లేజర్ వ్యవస్థ నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తోందని.. వాటిల్లో నేవీ అడ్వాన్స్‌డ్ కెమికల్ లేజర్, మిడిల్ ఇన్ఫార్రెడ్ అడ్వాన్స్‌డ్ కెమికల్ లేజర్, టాక్టికల్ హైఎనర్జీ లేజర్, స్పేస్ బేస్డ్ లేజర్ వంటివి ఉన్నాయన్నారు. వాటిల్లో కొన్నింటిని క్షేత్ర స్థాయిలో అగ్రరాజ్యం పరీక్షించింది. తద్వారా హైపర్‌సానిక్ క్షిపణులను ధ్వంసం చేయాడానికి కూడా వినియోగించాలనే ఆలోచనలో ఉంది. ఈ లేజర్ల పరిధి కేవలం కొన్ని కిలోమీటర్లు మాత్రమేనని.. కానీ తాజాగా చైనా కనుగొన్న టెక్నాలజీ లేజరాస్ర్తంతో విధ్వంసక శక్తి మరింత పెరుగుతుందని శాస్ర్తవేత్తలు తెలిపారు.