Brazil Presiden: బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా తన నివాసంలోని బాత్రూంలో జారి కింద పడ్డారు. దీంతో ఆయన తలకు బలమైన గాయమైంది. లూలా ప్రస్తుతం బాగానే ఉన్నట్లు తెలిపారు. అయితే, ఆయన తలకు కుట్లు వేయాల్సి వచ్చిందని డాక్టర్ రాబర్టో కలీల్ పేర్కొన్నారు. లూలా చిన్న మెదడులో రక్తస్రావం అయినట్లు గుర్తించామన్నారు. దీంతో వారం మొత్తం లూలాకు పరీక్షలు చేయాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాతి రోజుల్లో గాయం మరింత తీవ్రమవుతుంది కాబట్టి క్రమం తప్పకుండా పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు.
Read Also: Hyderabad Crime: బాచుపల్లిలో దారుణం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..
అయితే, బ్రెజిల్ అధ్యక్షుడి ఆరోగ్యం గురించి ఎవరు ఆందోళన అవసరం లేదని.. రోజువారి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని డాక్టర్ రాబర్టో కలీల్ పేర్కొన్నారు. తాత్కాలికంగా ఎక్కువ దూరం విమాన ప్రయాణం మంచిది కాదని సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో రష్యాలో జరుగనున్న బ్రిక్స్ సదస్సుకు బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా దూరం కానున్నారు. ఇక, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారని ఆయన కార్యాలయం వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆయన రష్యాకు బయల్దేరాల్సి ఉండగా.. గాయం కారణంగా వెళ్లలేక పోయారు.