Blue Supermoon: ఈ వారం ఆకాశంలో అద్భుతం జరగబోతోంది. సాధారణం కన్నా పెద్దగా చంద్రుడు దర్శనమివ్వబోతున్నాడు. ఆగస్టు 31న పౌర్ణమి రోజున చంద్రుడు ‘బ్లూ సూపర్‌మూన్’గా దర్శనమివ్వబోతున్నాడు. సాధారణం కన్నా 14 శాతం పెద్దదిగా చందమామ కనిపించనున్నాడు. దీంతో పాటు 30 శాతం అధికంగా ప్రకాశవంతంగా కనిపిస్తాడు.
చంద్రుడు, భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతుంటాడు. అయితే ఇలా తిరిగే క్రమంలో చంద్రుడు కొన్ని సార్లు భూమికి తక్కువ దూరంలో ఉంటాడు. దీన్ని పెరీజీ అని, దూరంగా ఉండే పాయింట్ ను అపోజీ అని అంటారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 31 పెరీజీ పాయింట్ వద్ద చంద్రుడు, భూమికి దగ్గరగా రాబోతున్నాడు. ఈ సమయంలో చంద్రుడు సాధారణం కన్నా పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఇదే ఈ ఏడాదిలో అతిపెద్ద సూపర్ మూన్.
Read Also: kangana ranaut: వారు అలాంటి వారు.. ఇస్రో మహిళా శాస్త్రవేత్తలపై కంగనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
2023లో నాలుగు సూపర్‌మూన్‌లు ఉన్నాయి, అయితే ఆగస్టు 30 నాటి బ్లూ సూపర్‌మూన్ అత్యంత ముఖ్యమైనది. బ్లూ మూన్ అనేది క్యాలెండర్ నెలలో రెండో పౌర్ణమిని సూచిస్తుంది. చంద్రుడి ల్యూనార్ సైకిల్ 29.5 రోజులు ఉంటుంది, కాబట్టి ప్రతీ రెండు నుండి మూడేళ్లకు ఒకే నెలలో రెండు పౌర్ణమిలు సంభిస్తుంటాయి. ఇలా సూపర్ మూన్, బ్లూమూన్ కలిసి రావడం చాలా ప్రత్యేకమైనదిగా ఖగోళ నిపుణులు చెబుతున్నారు. బ్లూ మూన్ అని పిలుస్తున్నప్పటికీ వాస్తవంగా చంద్రుడు నీలం రంగులో కనిపించడు.
సూపర్‌మూన్ మరియు బ్లూ మూన్ కలయిక చాలా అరుదైన సంఘటన. సగటున, ఈ ఖగోళ సంఘటన దాదాపు ప్రతి 10 సంవత్సరాలకు జరుగుతుంది. తర్వాతి సూపర్ మూన్, బ్లూ మూన్‌లు కలిసి జనవరి మరియు మార్చి 2037 వరకు జరగవని నాసా అంచనా వేసింది. అగ్ని పర్వత విస్పోటనం, గాలిలో పొగ వంటి సందర్భాల్లో మాత్రమే చంద్రుడు నీలి రంగులో కనిపిస్తాడు. ఈ దశాబ్ధంలో కేవలం అరడజను సార్లు మాత్రమే ఇలా జరిగింది.