Pakistani Minister: ఇండియన్ సినీ హిస్టరీలో అత్యధిక వసూళ్లను సాధించిన మూవీల్లో ‘దంగల్’ ఒకటి. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక, పాకిస్తాన్‌లో మాత్రం ఈ సినిమా విడుదల కాలేదు. ఇప్పుడు ఈ విషయంపై పాక్ మాజీ సమాచార శాఖ మంత్రి, ప్రస్తుత పంజాబ్ ప్రావిన్స్ సీనియర్ మంత్రి మరియం ఔరంగజేబు స్పందించారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదట్లో ‘దంగల్’ సినిమా విడుదలైంది, ఆ సమయంలోనే అధికారులు ఈ సినిమాపై నిషేధానికి సిఫారసు చేశారని తెలిపారు. ఆ మూవీని నేను చూడకుండానే నిషేధానికి ఒప్పుకున్నాను.. అది నా రాజకీయ జీవితంలో చేసిన ఒక పెద్ద తప్పు అని ఆమె అంగీకరించింది.
Read Also: IND vs AUS: నాలుగు నెలల సమయం ఉన్నా.. హాట్‌కేకుల్లా మ్యాచ్ టికెట్లు! ఒక్కడే 880 టిక్కెట్లు
ఇక, 18 నెలల తర్వాత ‘దంగల్’ సినిమాను చూసిన తర్వాత తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని మాజీ సమాచార శాఖ మంత్రి మరియం ఔరంగజేబు పేర్కొన్నారు. ఈ మూవీ బాలికలకు ఎంతో స్ఫూర్తినిచ్చే కథ.. అలాంటి సినిమాను నిషేధించడం నిజంగా నన్ను తీవ్రంగా కలచివేసిందని విచారం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటుడు అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ సెన్సార్ బోర్డు కొన్ని షరతులతో సినిమాను ఆమోదించాలని చెప్పింది.. భారత జాతీయ గీతం వినిపించే దృశ్యాన్ని, జాతీయ పతాకం కనిపించే భాగాన్ని తీసేయాలని వాళ్లు చెప్పారని గుర్తు చేశారు. అయితే, నా దేశ గౌరవానికి విరుద్ధంగా ఎలాంటి మార్పులు చేసేందుకు నేను ఒప్పుకోలేదని వెల్లడించారు. నా నిర్ణయంతో సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడినా సరే, దేశం మీద ప్రేమ తగ్గొద్దని అమీర్ ఖాన్ స్పష్టంగా తెలిపారు.