Biden holds emergency roundtable meeting with world leaders: ఇండోనేషియా బాలిలో జీ-20 సమావేశాలు జరగుతున్నాయి. ఈ సమావేశాల్లో యూఎస్ ప్రెసిడెంట్ జో జైడెన్ కూడా పాల్గొన్నారు. తాజాగా ఆయన ప్రపంచ నాయకులతో అత్యవసరంగా రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధ నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది. మంగళవారం రష్యాకు సంబంధించిన ఓ మిస్సైల్ ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన పోలాండ్ లో పడిందని ఆ దేశం ఆరోపిస్తోంది. అయితే రష్యా మాత్రం దీన్ని ఖండిస్తోంది. పోలాండ్ లో మిస్సైల్ కూలిపోవడంతో ఇద్దరు మరణించారు.
Read Also: Dog Attack: కుక్క దాడికి గురైన మహిళకు రూ.2 లక్షల పరిహారం
నాటోలో సభ్యదేశం అయిన పోలాండ్ పై మిస్సైల్ పడటంతో నాటో దేశాలు రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై జీ-20 సమావేశంలో పాల్గొన్న బైడెన్, ప్రపంచ నేతలతో అత్యవసర సమావేశంలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం బాలిలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నట్లు అమెరికా వెల్లడించింది. ఫ్రాన్స్, కెనడా, యూకే, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ ఇతర దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నాటో, జీ-7 దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు అమెరికా వెల్లడించింది.
రష్యా చర్యను నాటో సభ్యదేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పోలాండ్ లో రష్యా మిస్సైల్ పడిపోవడంపై అమెరికా, దాని మిత్రదేశాలు విచారణ సాగిస్తాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే జీ-20 సభ్యదేశాలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ దేశాధినేతలు ఓ ప్రకటనపై సంతకాలు చేయబోతున్నారు. అయితే ఈ ప్రకటనపై ఎన్ని దేశాలు సంతకం చేయబోతున్నాయో అనే దానిపై స్పష్టత లేదు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచంపై ఆహార, ఇంధన సంక్షోభ ప్రభావం పడుతోంది. జీ-20 దేశాల తర్వాతి సమావేశం భారతదేశంలో జరగబోతున్నాయి. 2023కి గానూ భారత్ జీ-20 అధ్యక్ష బాధ్యతలు తీసుకోనుంది.