Bangladesh: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చింది. హింసాత్మక విద్యార్థి ఉద్యమం తర్వాత మహ్మద్ యూనస్ బంగ్లా తాత్కాలిక పాలకుడిగా మారాడు. ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి మతోన్మాదుల చేతిలో పావుగా మారిపోయాడు. జమాతే ఇస్లామి వంటి సంస్థలతో అంటకాగుతూ, బంగ్లా వ్యాప్తంగా మతోన్మాదాన్ని పెంచిపోషిస్తున్నాడు. తాజాగా, మహ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో మ్యూజిక్, డ్యాన్స్, పీఈటీ టీచర్ల పోస్టుల్ని రద్దు చేశారు.
ప్రాథమిక పాఠశాల పాఠ్యాంశాల్లో భాగంగా సంగీతం, నృత్యం వంటి సాంస్కృతిక విద్యను మతపరమైన, విద్యా విషయాలతో పాటు తీసుకురావాలని గతంలో లక్ష్యంగా పెట్టుకున్న యూనస్, ఇప్పుడు ఇస్లామిస్టుల ఒత్తిడికి తలొగ్గారు. సంగీతం, డ్యాన్స్ లను ‘‘ఇస్లామిక్ వ్యతిరేక ఎజెండా’’గా పిలుస్తూ ఇస్లామిస్ట్ గ్రూపుల నుంచి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి రావడంతో యూనస్ యూటర్న్ తీసుకున్నాడు. ఈ టీచర్ల నియామకాన్ని బంగ్లాదేశ్లోని చాలా మత సమూహాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
‘‘మేము చిన్నప్పుడు మత విద్యను అభ్యసించినప్పుడు, హిందువులు-ముస్లింలకు వేర్వేరు ఉపాధ్యాయులు ఉండేవారు. మేము వారి కింద చదువుకున్నాము. కానీ ఇప్పుడు, మీరు సంగీత ఉపాధ్యాయులను నియమించాలనుకుంటున్నారా? వారు ఏమి బోధిస్తారు? మీ ఉద్దేశం ఏమిటి? మీరు మా పిల్లలను అగౌరవంగా, వికృతంగా మరియు వ్యక్తిత్వం లేనివారిగా చేయాలనుకుంటున్నారా? మేము దానిని ఎప్పటికీ సహించము’’ అని ఇస్లామీ ఆండోలోన్ బంగ్లాదేశ్ చీఫ్ సయ్యద్ రెజాల్ కరీం అన్నారు. ప్రభుత్వ చర్యను దేవబంది ఇస్లామిస్ట్ న్యాయవాద బృందం ‘‘ఇస్లామిక్ వ్యతిరేక ఎజెండా’’గా పిలిచింది.