NTV Telugu Site icon

Bangladesh: పాకిస్తాన్‌తో 1971 సమస్యల పరిష్కారానికి బంగ్లాదేశ్ సిద్ధం..

Pakistan Bangla

Pakistan Bangla

Bangladesh: బంగ్లాదేశ్ నెమ్మనెమ్మదిగా పాకిస్తాన్‌కి దగ్గర అవుతోంది. ఏ దేశం నుంచి తమకు స్వాతంత్య్రం కావాలని పోరాడిందో, ప్రస్తుతం షేక్ హసీనా దిగిపోయిన తర్వాత ఆ దేశానికి దగ్గర కావడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా షేక్ హసీనాను గద్దె దించడంతో కీలక పాత్ర పోషించిన విద్యార్థి నేత, ప్రస్తుతం బంగ్లా తాత్కాలిక ఐటీ మంత్రిగా ఉన్న నహిద్ ఇస్లాం పాకిస్తాన్ రాయబార అధికారులతో భేటీ అవుతున్నాడు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావాలని కోరుకుంటున్నట్లు అతను పేర్కొన్నాడు. పాకిస్తాన్‌తో 1971 విముక్తి యుద్ధ సమస్యలను పరిష్కరించుకోవడానికి, ప్రజాస్వామ్య సంబంధాల బలోపేతాన్ని బంగ్లాదేశ్ కోరుకుంటోందని నహీద్ ఇస్లాం చెప్పారు.

Read Also: Bangladesh: పాకిస్తాన్‌ నుంచి భారీగా ఆయుధాలు కొంటున్న బంగ్లాదేశ్.. ఇండియానే లక్ష్యమా..?

హసీనా హయాంలో బంగ్లా, పాక్‌ల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉండేవి, ప్రత్యేకించి 1971 యుద్ధ సమయంలో పాక్‌కి సహకరించిన జమాతే ఇస్లామీకి చెందిన నాయకులపై యుద్ధ నేరాలు పెట్టారు. ఢాకాలో పాకిస్తాన్ హైకమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్‌తో వరస సమావేశాల తర్వాత నహీద్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సెప్టెంబర్ 01న జరిగిన సమావేశం తర్వాత పాక్‌తో సంబంధాలను నహీద్ ఇస్లాం కాంక్షించారు. మరోవైపు, గత ప్రభుత్వం చర్చించడానికి మాకు అవకాశం ఇవ్వలేదని, 1971 సమస్యని సజీవంగా ఉంచిందని పాక్ రాయబారి అన్నారు. బంగ్లాతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి పాక్ ఆసక్తి చూపుతోందని అన్నారు.

1971 బంగ్లాదేశ్ చరిత్రలో ఒక ముఖ్య సమస్య అని నహీద్ ఇస్లాం అన్నాడు. అవామీ లీగ్ ప్రకారం.. 1971 చరిత్ర యొక్క చివరి అధ్యాయం, కానీ ఇది చరిత్రకు కొనసాగింపుగా మేము భావిస్తున్నామని చెప్పాడు. 1971 బంగ్లా విముక్తి పోరాటంతో పాక్‌లో భాగంగా ఉన్న పశ్చిమ పాకిస్తాన్(ఇప్పటి బంగ్లాదేశ్)పై పాక్ ఆర్మీ అకృత్యాలకు పాల్పడింది. 30 లక్షల మరణాలు సంభవించాయి. ఈ దురాగతాలకు బంగ్లా పాక్ నుంచి క్షమాపణలు కోరింది. అయితే గత 53 ఏళ్లుగా ఈ రెండు దేశాల సంబంధాల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, ఇప్పటికే సమస్యపై ఎలాంటి పరిష్కారం రాలేదు.