Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ మరోసారి మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికే, అక్కడి యూనస్ ప్రభుత్వానికి, ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్‌కి పడటం లేదు. ఆర్మీ చీఫ్ హెచ్చరికల తర్వాత యూనస్ ప్రభుత్వం మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రానికి ‘‘మానవతా కారిడార్’’ని తిరస్కరించింది. బంగ్లాదేశ్ ఈ కారిడార్‌ని ‘‘రక్తపాత కారిడార్’’గా పిలిచారు. విదేశాంగ శాఖ సలహాదారు తౌహిద్ హుస్సేన్ ఏకపక్షంగా ఐక్యరాజ్యసమితి ప్రతిపాదిత రఖైన్ కారిడార్ అంగీకరించిందని ప్రకటించారు. దీనిపై ఆర్మీ చీఫ్ తీవ్ర హెచ్చరికలు చేయడంతో, ప్రభుత్వం యూ-టర్న్ తీసుకుంది.
ఈ కారిడార్ బంగ్లాదేశ్ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తుందని, ఇది భౌగోళిక వ్యూహాత్మక ప్రయోజనాల కోసం అమెరికా దీనిని ముందుకు తెస్తోందని బంగ్లాదేశ్‌కి ఆందోళన ఉంది. ఎన్నికలు లేకుండా అధికారంలో ఉండటానికి యూనస్, ఆయన మద్దతు దాడులు అమెరికా డిమాండ్లకు తలొగ్గుతున్నారని బంగ్లాదేశ్ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ కారిడార్‌పై ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ మాట్లాడుతూ..‘‘ బంగ్లాదేశ్ సైన్యం సార్వభౌమత్వానికి హాని కలిగించే ఏ కార్యకలాపాల్లో పాల్గొనదు. అలా చేయడానికి ఎవరిని అనుమతించదు’’ అని హెచ్చరికలు జారీ చేశారు.
Read Also: Trump: ‘‘ట్రంప్ ప్రతీ దానికి క్రెడిట్ తీసుకుంటారు’’.. అది ఆయన లక్షణం..
ఇదే కాకుండా, ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని, సైనిక విషయాల్లో జోక్యం చేసుకోవడం మానేయాలని, రఖైన్ కారిడార్ ప్రాజెక్టు వంటి కీలక అంశాలు సైన్యం అదుపులో ఉండాలని జమాన్ యూనస్‌కి కఠిన స్వరంతో చెప్పారు. తూర్పు బంగ్లాదేశ్ చిట్టగాంగ్ డివిజన్‌ని మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రాన్ని ఈ కారిడార్ కలుపుతుంది. యుద్ధంతో సతమతమవుతున్న రఖైన్ రాష్ట్రంలోని ప్రజలకు ఈ కారిడార్ ద్వారా మానవతా సాయం అందించాలనేది ప్రధాన ఉద్దేశ్యం. అయితే, దీనికి తాత్కాలిక ప్రభుత్వం అనుమతి తెలపడాన్ని ఖలీదా జియాకు చెందిన బీఎన్పీ, వామపక్ష పార్టీలు అభ్యంతరం తెలిపాయి.
బర్మా సైన్యం దాడులతో ఆ రాష్ట్రంలోని రోహింగ్యాలు బంగ్లాదేశ్ కి వస్తున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ డివిజన్‌లోని కాక్స్ బజార్ ఏకంగా 1.3 మిలియన్ల రోహింగ్యాలకు ఆశ్రయం ఇస్తోంది. ఈ పరిస్థితితో ఆయుధాల అక్రమ రవాణా, నేర కార్యకలాపాలు పెరిగాయి. ఇది బంగ్లాదేశ్ భద్రతకే ప్రమాదంగా మారింది. అయితే, ఇప్పటి ప్రతిపాది కారిడార్ అమెరికా వ్యూహంగా, చైనాకు చెక్ పెట్టేందుకు తీసుకువస్తున్నారని, ఇది బంగ్లాదేశ్ సార్వభౌమత్వానికి ప్రమాదంగా మారుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.