Moon Mission: చంద్రుడిపై అన్ని దేశాలు తమ దృష్టిని సారిస్తున్నాయి. భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహంపై భవిష్యత్తులో మానవ నివాసాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. రాబోయే అంతరిక్ష ప్రయోగాలకు చంద్రుడిని లాంచ్ ప్యాడ్ గా ఉపయోగించుకోవాలనే ఆలోచనల్లో పలు దేశాలు ఉన్నాయి. ఇప్పటికే చంద్రుడిపైకి ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతమైంది. ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో మరికొన్ని దేశాలు కూడా చంద్రుడిపైకి రోవర్లను పంపేందుకు సమాయత్తం అవుతున్నాయి.
ఆస్ట్రేలియా కూడా చందమామను అందుకోవాలని చూస్తోంది. అక్కడ మట్టి నుంచి ఆక్సిజన్ సేకరించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. తన మొదటి మూన్ మిషన్, రోవర్ ని ఆస్ట్రేలియా ప్రకటించింది. 2026 నాటికి ఈ ప్రయోగం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి మిషన్ కి, రోవర్ కి పేరు పెట్టలేదు. చంద్రుడిపై రెగోలిత్ మట్టి నుంచి ఆక్సిజన్ వెలికి తీయాలని ప్లాన్ చేస్తున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సహకారంతో ఆస్ట్రేలియా ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తోంది. ఆక్సిజన్ వెలికి తీయడం భవిష్యత్తులో చంద్రుడిపై మానవ ఆవాసాలకు ఎంతో కీలకం.
Read Also: Physical Harassment: పాక్లో 45 మంది మహిళా టీచర్లపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు
ఆస్ట్రేలియా రోవర్ ప్రయోగం, నాసా ఆర్టెమిస్ మిషన్ లో భాగంగా చంద్రుడిపైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియా చంద్రుడి పైకి పంపించే మొదటి రోవర్. కాగా.. ఈ రోవర్ కి ఆ దేశ స్పేస్ ఏజెన్సీ ఇంకా పేరు నిర్ణయించలేదు. దీనికి పేరును సూచించాలని అక్కడి ప్రజలకు పోటీ నిర్వహిస్తోంది. అక్టోబర్ 20 వరకు పేర్లు సూచించవచ్చు. నాలు పేర్లను షార్ట్ లిస్ట్ చేసి, విజేత పేరును డిసెంబర్ ప్రారంభంలో ప్రకటిస్తుంది.
నాసా నిర్వహిస్తున్న ఆర్టిమిస్ ప్రోగ్రాంతో ఇది ఈ ప్రయోగం కూడా ఉంటుంది. ఆర్టెమిస్ ద్వారా ఈ దశాబ్ధం చివరి నాటికి చంద్రుడిపై మానవ ఉనికిని స్థాపించాలని నాసా భావిస్తోంది. నాసా ఇప్పటికే ఆర్టిమెస్ 1 ప్రయోగాన్ని నిర్వహించింది. ఇందులో ఓరియన్ రాకెట్, చంద్రుడి కక్ష్యలోకి వెళ్లి మళ్లీ తిరిగి భూమి మీదకు వచ్చింది. ఆర్టిమిస్-2 కోసం నాసా సిద్ధమవుతోంది. ఇందులో వ్యోమగాములను చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లుతుంది. 2024 చివరి నాటికి ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. ఆర్టిమిస్-3 2025 లేదా 2026లో ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రయోగంలో చంద్రుడి దక్షిణ ధృవంపై వ్యోమగాములు దిగనున్నారు.