A Married Woman Eloped With Lover With Husbands Lottery Money in Thailand: ఒకటి కాదు, రెండు కాదు.. ఆ దంపతులకు ఏకంగా 26 ఏళ్ల అనుబంధం. ఆ జంటకి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. భర్తకి తన భార్య అంటే ఎంతో ప్రేమ. ఏనాడూ ఇబ్బంది పెట్టిన పాపాన పోలేదు. ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. అసలు తన భార్యంటే అతనికి ఎంత ప్రేమంటే.. తనకు తగిలిన లాటరీ డబ్బులన్నీ తీసుకెళ్లి ఆమె చేతిలో పెట్టాడు. తాను ఒక్క రూపాయి కూడా దాచుకోకుండా.. బహుమతిగా ఆ మొత్తాన్ని ఆమెకు ఇచ్చేశాడు. కానీ.. ఆమె ఏం చేసిందో తెలుసా? భర్త ప్రేమగా ఇచ్చిన ఆ లాటరీ డబ్బులో తీసుకొని, తన ప్రియుడితో పరారైంది. అందరినీ నివ్వెరపోయేలా చేసే ఈ ఘటన.. థాయ్‌లాండ్‌లో చోటు చేసుకుంది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. థాయ్‌లాండ్‌కు చెందిన మణిత్, అంగన్‌రాత్‌లు భార్యాభర్తలు. 26 ఏళ్లుగా దాంపత్య జీవితం కొనసాగిస్తున్న ఈ జంటకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కట్ చేస్తే.. ఇటీవల మణిత్‌కి రూ. 1.3 కోట్ల లాటరీని తగిలింది. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అందులో కొంత భాగం ఆలయానికి విరాళంగా ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని కుటుంబ సభ్యుల కోసం ఉపయోగించాలని అనుకున్నాడు. ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసి, కుటుంబంతో విలాసవంతమైన జీవితాన్ని గడపాలని చక్కగా ప్లాన్ చేసుకున్నాడు. లాటరీ తగిలిన విషయాన్ని తన కుటుంబ సభ్యులకి తెలిపిన మణిత్.. ఈ సందర్భంగా ఒక గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు. తన స్నేహితుల్ని, చుట్టుపక్కల వారిని ఈ పార్టీకి పిలిచాడు. ఇదే అదునుగా.. మణిత్ భార్య ఈ పార్టీకి ఒక ప్రియుడ్ని వెంట వేసుకొని వచ్చింది. అతడెవరని భర్త ప్రశ్నించగా.. తన దూరపు బంధువు అని సమాధానం ఇచ్చింది. దీంతో.. అతడు సందేహించకుండా, మళ్లీ పార్టీలో మునిగిపోయాడు.
అయితే.. కాసేపైన తర్వాత ఆ పార్టీలో మణిత్‌కి తన భార్య కనిపించలేదు. ఆమెతో వచ్చిన వ్యక్తి కూడా అక్కడ లేడు. తన లాటరీ డబ్బులు కూడా మాయం అవ్వడంతో.. భార్య తనకు కుచ్చుటోపీ పెట్టి, ప్రియుడితో లేచిపోయిందని మణిత్ గ్రహించాడు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ లాటరీ డబ్బుల్ని భార్యకు గిఫ్ట్‌గా ఇచ్చానని, వాటిని దాయమని చెప్తే, తననిలా మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే.. ఇక్కడ అతనికి మరో ట్విస్ట్ తగిలింది. పెళ్లయి 26 ఏళ్లు అయినా.. మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోవడంతో మణిత్‌కు ఎలాంటి న్యాయం చేయలేమని పోలీసులు తేల్చి చెప్పారు. తాము కేవలం.. భార్యని ఒప్పించి, డబ్బు ఇప్పించే ప్రయత్నం చేయగలమని హామీ ఇచ్చారు. అప్పట్నుంచి అతడు భార్య కోసం తీవ్రంగా గాలించడం మొదలుపెట్టాడు. మీడియాకు కూడా ఎక్కాడు. మరి, ఇతని ప్రయత్నం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.