Brain Eating Amoeba: ట్యాప్ వాటర్ లో ముక్కు కడుక్కున్నందుకు ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన అమెరికాలోని సౌత్ ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. కుళాయి నీటిలో ముక్కును శుభ్రం చేసుకున్న సమయంలో నీటిలో ఉన్న అమీబా సదరు వ్యక్తి శరీరంలోకి ప్రవేశించింది. అత్యంత అరుదుగా సోకే ‘‘మెదడును తినే అమీబా’’ నెగ్లిరియా ఫౌలోరి కారణంగా అతను మరణించాడని ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. షార్లెట్ కౌంటీ నివాసి అయిన వ్యక్తి, ఫిబ్రవరి 20 న మరణించాడు. యునైటెడ్ స్టేట్స్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం నెగ్లెరియో ఫౌలెరి అత్యంత అరుదుగా సంభవించే, ప్రాణాంతక అమీబా. ఇది సోకితే దాదాపుగా మరణమే.
Read Also: Sushmita Sen: బిగ్ బ్రేకింగ్.. సుస్మితా సేన్ కు గుండెపోటు
నెగ్లేరియా ఫౌలెరి అనేది సరస్సులు, నదులు, వేడి నీటి బుగ్గలు వంటి మట్టి, వెచ్చని మంచినీటిలో నివసించే ఒక అమీబా. ఈ అమీబాతో కలుషితమైన నీరు ముక్కులోకి ప్రవేశించినప్పుడు ఈ అమీబా మానవ శరీరంలోకి చేరుతుంది. అక్కడి నుంచి మనిషి మెదడుకు చేరి మెదడు కణజాలాన్ని ప్రభావితం చేస్తుంది. అమెరికాలో ప్రతీ ఏడాది ముగ్గురు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీన్నిప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెపాలిటిస్(పీఎఎం) అని పిలుస్తారు. ఈ వ్యాధికి ప్రభావవంతమైన చికిత్స లేదు. మెదడుపై అటాక్ చేయడం వల్ల మెదడు ఉబ్బుతుంది. మెదడు కణజాలాన్ని నాశనం చేస్తుంది. ప్రారంభ దశలో ఈ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ మెనింజైటిస్ ను పోలి ఉంటుంది.
ఈ ఇన్ఫెక్షన్ సోకిన వారిలో 97 శాతం మరణిస్తుంటారు. 1962 నుండి 2021 వరకు యునైటెడ్ స్టేట్స్‌లో తెలిసిన 154 మంది సోకిన వ్యక్తులలో నలుగురు మాత్రమే ఈ వ్యాధి నుంచి బయటపడ్డారు. మిగతా వారంతా మరణించారు. ప్రస్తుతం వ్యక్తి మరణంతో అమెరికా ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది. అసలు ఇది ఎలా సోకిందనే విషయాలను కనుక్కుంటున్నారు. స్థానికంగా ఉండేవారు స్నానం చేసేటప్పుడు, ఈతకొట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.