Baby Growing In Bowel: ఫ్రాన్స్ దేశంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లింది. మహిళ పరిస్థితి తెలుసుకున్న డాక్టర్లతో పాటు నిజం తెలిసి సదరు మహిళ కూడా ఒక్కసారిగా కంగుతిన్నారు. 37 ఏళ్ల మహిళ తనకు తెలియకుండానే 23 వారాల గర్భవతి అని తేలింది. అయితే బిడ్డ పేగులో పెరుగుతున్నాడనే వార్త తెలిసి అంతా షాక్‌కి గురయ్యారు.
న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ఈ కేసు వివరాలు ప్రచురించబడ్డాయి. సదరు మహిళ పది రోజుల పాటు తీవ్రమైన కడుపునొప్పి, ఉబ్బరంతో ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు స్కాన్ చేసి చూస్తే, కడుపు, పేగుల మధ్య ఉదర కుహరంలో సాధారణంగా ఏర్పడిన పిండం పెరుగుతున్నట్లు గమనించారు. ఫలిదీకరణ సమయంలో అండం గర్భాశయం వెలుపల, ఉదర కుహరంలోకి వచ్చినప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతాయని, దీనిని ‘‘ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ’’ అని అంటారని వైద్యులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో చాలా సందర్భాల్లో బిడ్డను కోల్పోవడం జరుగుతుందని చెప్పారు.
Read Also: Lok Sabha security breach: బీజేపీ ఎంపీ పేరుతో విజిటర్ పాస్.. పార్లమెంట్ ఘటనలో కీలక విషయాలు..
అయితే, ఫ్రాన్స్‌లోని వైద్యులు మాత్రం విజయవంతంగా 29 వారాల బిడ్డను ప్రసవించేలా చేశారు. మూడు నెలల తర్వాత నవజాత శిశువు, తల్లి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఇంటర్నల్ బ్లీడింగ్, ట్యూబ్ పగిలిపోవడం వంటివి జరిగి తల్లికి ప్రమాదం తెచ్చే అవకాశం ఉంటుంది. ఇది పిండం మరణానికి దారి తీయవచ్చు. ఇలాంటి కేసుల్లో 90 శాతం బిడ్డను కోల్పోయే అవకాశాలే ఉంటాయి. జీవించి ఉన్నప్పటికీ.. పుట్టుకతో వచ్చే లోపాలు, మెదడు దెబ్బతినే అవకాశం ప్రతీ ఐదుగురిలో ఒకరికి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
ఇలాంటి సందర్భంలోనే ఫ్రాన్స్ వైద్యులు అత్యాధునిక చికిత్స పద్ధుతులను ఉపయోగించి, ఆశ్చర్యకరంగా డెలివరీ చేశారు. అయితే గర్భాశయంలో కూకుండా పొట్టలోని ఇతర ప్రాంతాల్లో బిడ్డ పెరగడం ఇదే మొదటికేసు కాదు. గతంలో కాలేయంలో పెరుగుతున్న పిండం కేసు నమోదైంది. సాధారణంగా పొత్తి కడుపులో మాత్రమే పిండం పెరగడం చూస్తాం, కానీ కాలేయంలో పిండం పెరిగే కేసు చూడటం మొదటిసారని మానిటోబాలోని చిల్డ్రన్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన డాక్టర్ మైఖేల్ నార్వే చెప్పారు.