US- India Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 25 శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం నేటి (ఆగస్టు 1న) నుంచి అమలులోకి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ తన లిబరేషన్ డే వాణిజ్య వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ వ్యూహం అమెరికా వాణిజ్య భాగస్వామ్యాలను పరస్పర ప్రయోజనాల దిశగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్‌లో ఈ విషయాన్ని తెలియజేశారు. భారత్ మన స్నేహ దేశం అయినప్పటికీ, వారు విధించే సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రపంచంలోనే అత్యధిక టారీఫ్స్ విధించే దేశాల్లో భారతదేశం ఒకటని పేర్కొన్నారు. అంతేకాక ఇండియా- రష్యా నుంచి సైనిక సామగ్రి, ఇంధనాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారని ట్రంప్ అన్నారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
భారతదేశంలో వీటిపై ప్రభావం చూపుతుంది..?
భారతదేశంలో ఈ 25 శాతం సుంకాల ప్రభావం సముద్ర ఉత్పత్తులు, ఔషధాలు, వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు, ఆటోమొబైల్ రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వీటితో పాటు వ్యవసాయ ఉత్పత్తులపై దాదాపు 39%, కూరగాయల నూనెలపై 45%, ఆపిల్, మొక్కజొన్నపై దాదాపు 50% రేట్లు పెరిగాయి. అయితే, ఆగస్టు చివరిలో అమెరికా బృందం భారత్ కి రానుంది. ఈ చర్చల ద్వారా సమగ్ర వాణిజ్య ఒప్పందం కుదిరే ఛాన్స్ ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఔషధ రంగం, ఇనుము, ఉక్కు, ఆటోమొబైల్ లాంటి రంగాలపై విధించే టారీఫ్స్ పై ఇంకా స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు. కాగా, అమెరికాకు భారత ఔషధ ఎగుమతులు 30 శాతం కంటే ఎక్కువగా ఉన్నాయి.
Read Also: P4 Policy: మాకేం లక్షల్లో జీతాల్లేవ్.. 164 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు!
అయితే, జపాన్ (15%), వియత్నాం (20%), ఇండోనేషియా (19%) కంటే ఎక్కువ సుంకం భారతదేశం చెల్లించాల్సి ఉంటుంది. ఇది భారత ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. ఔషధ రంగంలో భారతదేశం జనరిక్ ఔషధాలను ఎక్స్ పోర్ట్ చేస్తుంది. యూరప్ దేశాలు ఖరీదైన, బ్రాండెడ్ ఔషధాలను ఎగుమతి చేస్తాయి. అందువల్ల 25 శాతం సుంకం భారత ఔషధ ఎగుమతులపై పెద్దగా ప్రభావం చూపించక పోవచ్చు అనే భావన ఉంది. అలాగే, స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల విషయంలో కూడా చైనా (30%)తో పోలిస్తే భారతదేశం (25%)పై తక్కువ టారీఫ్స్ కలిగి ఉంది.
