Pakistan: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ కాల్పులతో దద్దరిల్లుతోంది. ఉగ్రవాదులకు, సైన్యానికి జరిగిన ఘర్షణల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఈ ఘర్షణల్లో 18 మంది భద్రతా సిబ్బంది, 12 మంది ఉగ్రవాదులు మరణించినట్లుగా తెలుస్తోంది. జనవరి 31-ఫిబ్రవరి 1 రాత్రి సమయంలో ప్రావిన్స్‌లోని కలాట్ జిల్లాలోని మంగోచార్ ప్రాంతంలో రోడ్డుని ఉగ్రవాదులు దిగ్భందించడంతో ఈ సంఘటన జరిగిందని పాక్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది.
Read Also: Delhi Polls: ఎన్నికల ముందు ఆప్‌కి భారీ షాక్.. బీజేపీలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలు..
శనివారం పాక్ సైన్యం ‘‘ క్లియరెన్స్ ఆపరేషన్స్’’గా ఈ ఆపరేషన్‌ని అభివర్ణించింది. ఉగ్రవాదులు ఏ గ్రూపుకు చెందినవారనేది స్పష్టత రాలేదు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఉగ్రదాడిని ఖండించారు. పాకిస్తాన్‌లో అతిపెద్ద ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్ గత కొన్నేళ్లుగా అట్టుడుకుతోంది. ఈ ప్రాంతంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) విముక్తి ఉద్యమాన్ని ప్రారంభించింది. పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం కోసం బలూచ్ వీరులు పాక్ సైన్యం, పోలీసులపై దాడులు చేయడం నిత్యకృత్యంగా ఉంది.