Iran: ఇరాన్ దేశం పూర్తిగా మతపాలనపై ఆధారపడి ఉంటుంది. ఇస్లామిక్ చట్టాలు ఎక్కువగా పాటిస్తుంటారు. ముఖ్యంగా మహిళల వస్త్రధారణ విషయంలో చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తుంటారు. ఎవరైనా మహిళలు హిజాబ్ నియమాలను ఉల్లంఘిస్తే శిక్షలు దారుణంగా ఉంటాయి. తాజాగా హిజాబ్ చట్టాలను ఉల్లంఘించినందుకు దేశంలోని 12 మంది మహిళా నటులపై నిషేధాన్ని విధించింది అక్కడి ప్రభుత్వం. సినిమాల్లో నటించకుండా వీరందరిపై బ్యాన్ విధించింది.
Read Also: Patalkot Express: పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. 4 కోచ్‌లు దగ్ధం..
ఈ జాబితాలో ప్రముఖ నటులైన తరనేహ్ అలిదూస్తీ, కటాయోన్ రియాహి మరియు ఫతేమెహ్ మోటమెద్-అరియా వంటి వారు ఉన్నారు. చట్టాన్ని అనుసరించని వారు పనిచేయడానికి అనుమతింపబడరు అని ఇరాన్ కల్చర్, ఇస్లామిక్ గైడెన్స్ మినిస్టర్ మహ్మద్ మెహదీ ఎస్మాయిలీ క్యాబినెట్ సమావేశంలో మీడియా ముందు అన్నారు.
గతేడాది హిజాబ్ కారణంగా మోరాలిటీ పోలీసులు కొట్టడంతో 22 ఏళ్ల కుర్దిష్ యువతి మహ్స అమిని మరణించారు. ఈమె మరణం ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక ఉద్యమానికి ఆజ్యం పోసింది. ఈ ఆందోళనల్లో పాల్గొనందుకు అలిదూస్తి, రియహిని కొంతకాలం నిర్భందించారు. హిజాబ్ వ్యతిరేక ఉద్యమం సమయంలో మహిళలు తన హిజాబ్ తీసేసి, జట్టు కత్తిరించుకుని నిరసన తెలిపారు. ఇప్పటికీ కొంతమంది యువతులు హిజాబ్ ని పట్టించుకోవడం లేదు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత 1983 నుంచి మహిళలకు హిజాబ్ తప్పనిసరి చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో డ్రెస్ కోడ్ ఉల్లంఘించిన మహిళలకు 10 ఏళ్ల జైలు శిక్ష, జరిమానాలను కఠినతరం చేయడానికి అక్కడి ఇస్లామిక్ ప్రభుత్వం అనుకూలంగా ఓటేసింది.