Kabul Blast: అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో పది మంది మృతిచెందారు. ఈ పేలుడులో ఇద్దరు రష్యా రాయబార కార్యాలయ సిబ్బంది మరణించినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరో 8 మంది గాయపడినట్లు సమాచారం. కాబూల్‌లోని రష్యన్ ఎంబసీ ప్రవేశ ద్వారం దగ్గర ఆత్మాహుతి బాంబర్ పేలుడు పదార్థాలను పేల్చాడని, గేటు వద్దకు రాగానే సాయుధ గార్డులు కాల్చిచంపారని ఆఫ్ఘన్ పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు. కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం సమీపంలో ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించినట్లు ఖామా ప్రెస్ తెలిపింది.
గతంలో కూడా రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు కారణంగా 15-20 మంది మరణించారని లేదా గాయపడ్డారని రష్యా మీడియా పేర్కొంది. గత నెలలో, రాజధాని నగరం కాబూల్‌లో అనేక పేలుళ్లు జరిగాయి, డజన్ల కొద్దీ అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కాబూల్‌లోని ఓ మసీదులో ఈ నెల రెండున జరిగిన బాంబు పేలుళ్ల సంఘటనలో 20 మంది మరణించారు. మృతుల్లో ప్రముఖ మత నాయకుడు ముజిబ్ ఉల్ రహమాన్ అన్సారీ కూడా ఉన్నారు. సుమారు 200 మంది గాయపడ్డారు. హెరాత్ నగరంలోని గుజర్గా మసీదులో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం ప్రార్థనల నిమిత్తం పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో మసీదు కిక్కిరిసిన సమయంలో ఈ పేలుళ్లు జరిగాయి.
World Corona: జపాన్ లో రోజూ లక్షకు పైగా కోవిడ్ కేసులు..
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ పాలనకు ఏడాది కాలం గడుస్తున్న నేపథ్యంలో ఈ వరుస పేలుళ్లు చోటుచేసుకున్నాయి. మానవ, మహిళల హక్కులను గౌరవిస్తామని తాలిబాన్ అనేక ప్రతిజ్ఞలను ఉల్లంఘించిందని హక్కుల సంఘాలు తెలిపాయి. గత ఏడాది ఆగస్టులో కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత, ఇస్లామిక్ అధికారులు మహిళలు, బాలికల హక్కులపై తీవ్రమైన ఆంక్షలు విధించారు, మీడియాను అణిచివేసారు. అధికారాలను దుర్వినియోగం చేయడంతో పాటు విమర్శకులను, ప్రత్యర్థులను ఏకపక్షంగా నిర్బంధించడమే కాకుండా చాలామందిని ఉరితీశారు.