Eating During Eclipse: మరికొన్ని గంటల్లో చంద్రగ్రహణం. ఈ ఏడాదిలో ఇది రెండవ చంద్రగ్రహణం. భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న రాత్రి 09.58 గంటలకు ప్రారంభమై మధ్యరాత్రి 01.26 గంటలకు ముగుస్తుంది. వాస్తవంగా చంద్రగ్రహణం గురించి అనేక రకాల మూఢనమ్మకాలు ప్రజల్లో బలంగా ప్రచారంలో ఉన్నాయి. కొందరు కేవలం వాళ్ల స్వార్థం కోసం హిందూ శాస్త్రాల పేరు చెప్పుకొని గ్రహణం సమయంలో ఈ పనులు చేయవద్దు, గర్భిణులు జాగ్రత్తలు ఉండాలి, వంటివి చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సైన్స్ చెబుతుంది. సైన్స్ పరంగా అసలు చంద్ర గ్రహణం అంటే ఏంటి, గ్రహణం సమయంలో ఆహారం తీసుకుంటే ఏం జరుగుతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
గ్రహణం సమయంలో ఆహారం వండటం లేదా తినడం వల్ల విషం వ్యాపిస్తుందని కొన్ని అపోహలు ఉన్నాయి. కానీ సైన్స్ ప్రకారం.. గ్రహణం ఆహారంపై ఎటువంటి ప్రభావం చూపదని చెబుతుంది. పూర్వం ప్రజలు ఆహారాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకునేవారు (ఎందుకంటే రిఫ్రిజిరేటర్ లేకుండా ఆహారం త్వరగా చెడిపోతుంది). కొన్ని సార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఆహారం చడిపోయేది. ఇది ఈ అపోహలకు దారితీసిందని నిపుణులు చెబుతున్నారు. గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీ బయటకు వెళితే బిడ్డకు మచ్చలు లేదా కోతలు ఉంటాయనే అపోహ ప్రజల్లో ఉంది. కానీ సైన్స్ ప్రకారం.. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. బిడ్డ శారీరక నిర్మాణం గ్రహణం ద్వారా కాదు, గర్భంలోని DNA, అభివృద్ధి ప్రక్రియ ద్వారా నిర్ణయించబడుతుందని పేర్కొంటున్నారు.
గ్రహణ సమయంలో ఇంట్లోని నీరు, మొక్కలు కలుషితమవుతాయనే అపోహ ఉంది. సైన్స్ ప్రకారం.. గ్రహణం ప్రభావం వీటిపై ఉండదు. ఇదంతా మూఢనమ్మకం అని చెబుతున్నారు. గ్రహణం భూమిపై ప్రకృతి వైపరీత్యాలను (భూకంపం, వరదలు మొదలైనవి) తెస్తుందనే మూఢనమ్మకం ఉంది. గ్రహణం ఒక ఖగోళ సంఘటన అని, దీనికి ప్రకృతి వైపరీత్యాలతో ప్రత్యక్ష సంబంధం లేదని సైన్స్ పేర్కొంటుంది. గ్రహణం ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుందనే అపోహ చాలా మందిలో ఉంది. దీని గురించి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రజలు అనారోగ్యంగా భావిస్తే, అది భయం, నమ్మకం ( ప్లేసిబో ప్రభావం) వల్ల వస్తుంది.
ప్లేసిబో ఎఫెక్ట్ అంటే..
ప్లేసిబో ఎఫెక్ట్ అంటే.. ఒక వ్యక్తి తనకు చికిత్స జరిగిందని నమ్మినప్పుడు, ఆ నమ్మకం వల్లనే అతని ఆరోగ్యం మెరుగుపడటం ప్రారంభిస్తాయి. అసలు ఔషధం లేదా చికిత్స ఇవ్వకపోయినా కూడా అతని నమ్మకం తన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉదాహరణకు ఒక రోగికి చక్కెర మాత్ర (దీనిలో ఎటువంటి ఔషధం లేదు) ఇచ్చి, అది తలనొప్పికి మందు అని చెప్పారని అనుకుందాం. రోగి తాను ప్రభావవంతమైన ఔషధం తీసుకున్నానని నమ్మకంగా ఉండటం వల్ల అతని తలనొప్పి తగ్గింది. ఇది ఔషధం యొక్క ప్రభావం కాదు, ఔషధంపై వ్యక్తి నమ్మకం ప్రభావం. దీనినే ప్లేసిబో ఎఫెక్ట్ అని అంటారు.