కోలీవుడ్లో ధనుశ్ దూకుడు ముందు ఏ హీరో నిలబడలేక పోతున్నారనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రత్యేకించి కథ,కథనాల విషయంలో ధనుష్ కి మంచి పట్టు ఉంది. ఆరంభం నుంచి ప్రయోగాలకి, వైవిధ్యానికి మారుపేరుగా ముందుకు సాగుతున్నాడు ధనుష్. ఇక ఇటీవల కాలంలో ఈ విషయంలో మరింతగా దూకుడు పెంచాడు. ఫలితమే ‘మారి 2’, ‘అసురన్’, ‘పట్టాస్’, ‘కర్ణన్’ వంటి సినిమాలు సాధించిన విజయాలు. ఇతర హీరోలతో పోటీపడకుండా తనదైన ప్రత్యేకతను చాటుతూ అటు కమర్షియల్ విజయాలు సాధిస్తూనే ఇటు అవార్డులు సైతం సాధిస్తున్నాడు. ఇమేజ్ చట్రానికి భిన్నంగా కొత్తగా ఫీలైన కథలను వరుసగా చేసుకుంటూ తోటి హీరోలకు అందనంత ఎత్తులో ఉన్నాడు. బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుంటూ వేగంగా సినిమాలు చేస్తున్నాడు. ఈ విషయంలో ధనుష్ కి పోటీ ఇచ్చే హీరో లేడు అనవచ్చు. హీరోగా, నిర్మాతగా, సింగర్ గా, పాటల రచయితగా ప్రత్యేక బాణీ చూపిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ధనుష్ ‘కర్ణన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కటి విజయాన్ని సాధించింది. ఇప్పటికే నటుడుగా రెండు జాతీయ అవార్డులను ‘ఆడుకాలం, అసురన్’ చిత్రాలకు అందుకున్న ధనుష్ ‘కాకాముట్టై, విచారణై’ సినిమాలకు కో ప్రొడ్యూసర్ గానూ జాతీయ అవార్డులు సాధించాడు. ఇటీవల విడుదలైన ‘కర్ణన్’ సినిమాకి కూడా జాతీయ అవార్డు ఖాయం అని వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ధనుష్ నటించిన ‘జగమేతంతిరమ్’ విడుదలకు సిద్ధం అయింది. ధనుష్ నటిస్తున్న బాలీవుడ్ సినిమా ‘ఆత్రంగి రే’ షూటింగ్ పూర్తి చేసుకుంది. కార్తీక్ నరేన్ సినిమాతో పాటు హాలీవుడ్ సినిమా ‘ద గ్రే మ్యాన్’ షూటింగ్ జరుపుకుంటున్నాయి. అంతే కాదు ఇటీవల విడుదలైన ‘కర్ణన్’ దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో మరో సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ధనుష్. ఇంతలా దూకుడు చూపిస్తున్న ధనుష్ మునుముందు ఇంకెన్ని వండర్స్ చేస్తాడో చూద్దాం.