Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూమి మీద మనకు కనిపించే సముద్రాలన్నీ కలిపినా… భూమి తనలో దాచుకున్న నీటితో పోలిస్తే అవి ఎంత చిన్నవో మనకు తెలియకపోవచ్చు. ఎందుకంటే మన కళ్లకు కనిపించని వేల కిలోమీటర్ల లోతులో, రాళ్ల మధ్య నీటిని బంధించుకుని ఉన్న ఒక భారీ ప్రపంచం ఉండే అవకాశం ఇప్పుడు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ భూమి లోపల నీరు ఎక్కడ దాగి ఉంటుందనే ప్రశ్న శాస్త్రవేత్తలను వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరికిందేమో అనిపించేలా రెండు కొత్త ఖనిజాలు బయటపడ్డాయి.
మన కాళ్ల కింద 660 కిలోమీటర్ల లోతు దాటితే భూమి స్వభావమే మారిపోతుంది. అక్కడి నుంచి దాదాపు 2,900 కిలోమీటర్ల వరకు విస్తరించిన ప్రాంతంలో రాళ్లు ఊహించలేనంత వేడి, ఒత్తిడిని ఎదుర్కొంటుంటాయి.
ఇదే మాంటిల్‌లోని అత్యంత లోతైన ప్రాంతం. అక్కడే భూమి లోపలి మాంటిల్, ద్రవరూపంలోని బయటి కోర్‌ను కలుసుకుంటాయి. ఈ సరిహద్దుకు దగ్గరగా కొన్ని ప్రాంతాల్లో భూకంప తరంగాలు అనూహ్యంగా నెమ్మదిస్తాయి. వాటినే అల్ట్రాలో వెలాసిటీ జోన్స్ అని పిలుస్తారు. ఇన్నాళ్లూ వాటి వెనుక ఉన్న అసలు కారణం శాస్త్రవేత్తలకు అంతుపట్టలేదు. ఇప్పుడు ఆ రహస్యంలోకి నీరు వచ్చి చేరింది.
Also Read
భూమి లోపలి పరిస్థితులను ప్రయోగశాలలో సృష్టించిన పరిశోధకులు, రెండు వజ్రాల మధ్య పదార్థాన్ని ఉంచి దాన్ని విపరీతమైన ఒత్తిడికి గురిచేశారు. ఆ తర్వాత లేజర్లతో భయంకరమైన వేడిని అందించారు.
భూమి గుండెల్లోకి వేల కిలోమీటర్లు దిగితే ఎదురయ్యే పరిస్థితులను చిన్న ప్రయోగశాలలో మళ్లీ సృష్టించారు. అక్కడ జరిగిన మార్పు శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. ఇంతకుముందెప్పుడూ గుర్తించని రెండు ఖనిజాలు ఏర్పడ్డాయి. ఇవి ఐరన్ ఆక్సీహైడ్రాక్సైడ్స్కు చెందినవి. వాటి ప్రత్యేకత ఏంటంటే… భూమి లోపల ఉన్న తీవ్రమైన పరిస్థితుల్లో కూడా ఇవి నీటిని తమలో బంధించుకోగలవు. కొన్ని ప్రయోగాల్లో నీటి పరిమాణం 0.1శాతం కంటే తక్కువగా ఉన్నా ఈ ఖనిజాలు ఏర్పడ్డాయి. అంటే నీరు అక్కడ భారీ సరస్సులా లేదా సముద్రంలా కనిపించాల్సిన అవసరం లేదు. రాళ్ల నిర్మాణంలోనే అది దాగి ఉండొచ్చు.
ఇక్కడే భూమి పుట్టుకకు సంబంధించిన మరో కథ మొదలవుతుంది. కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఇప్పటిలా చల్లగా, గట్టిగా ఉండేది కాదు. మండుతున్న మాగ్మా సముద్రంలా ఉండేది. ఆ అగ్నిగోళం క్రమంగా చల్లబడుతున్న సమయంలో ఈ ఖనిజాలు ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బరువైన ఈ ఖనిజాలు నెమ్మదిగా భూమి లోపలికి జారిపోయి, వాటిలో నీటిని కూడా తమతో పాటు తీసుకెళ్లి ఉండొచ్చు. అలా చూస్తే భూమి నీటిని కేవలం సముద్రాల రూపంలో మాత్రమే దాచుకోలేదు. తన గుండెల్లోని రాళ్ల మధ్య కూడా దాన్ని బంధించి ఉండొచ్చు. కానీ ఆ నీరు అక్కడే శాశ్వతంగా నిద్రపోదు. భూమి లోపల మాంటిల్ పదార్థం నిరంతరం నెమ్మదిగా కదులుతూనే ఉంటుంది.
లోతుల్లో ఉన్న పదార్థం పైకి కదిలే కొద్దీ ఒత్తిడి తగ్గుతుంది. అప్పుడు ఈ ఖనిజాలు విచ్ఛిన్నమై వాటిలో బంధించుకున్న నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఆ నీరు మళ్లీ భూమి అంతర్భాగంలో ప్రయాణించి, అగ్నిపర్వతాల ద్వారా చివరికి ఉపరితలానికి చేరే అవకాశం కూడా ఉంది. అంటే మనం ఆకాశాన్ని చూస్తే మేఘాలు కనిపిస్తాయి. నేలను చూస్తే సముద్రాలు కనిపిస్తాయి. కానీ మన కళ్లకు కనిపించని మరో నీటి ప్రయాణం భూమి గుండెల్లోనే కోట్ల సంవత్సరాలుగా సాగుతూ ఉండొచ్చు.
ఈ రెండు కొత్త ఖనిజాలు ఆ దాగిన ప్రపంచానికి తలుపు తెరిచాయి. అయితే ఆ తలుపు వెనుక అసలు ఎంత నీరు ఉంది… అది ఎంతకాలంగా అక్కడ ఉంది… భూమి మీదకు తిరిగి ఎంత నీరు చేరుతోంది… ఈ ప్రశ్నలకు సమాధానాలు మాత్రం ఇంకా భూమి లోపలే దాగి ఉన్నాయి.
తాజావార్తలు
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
-
మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
-
Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
-
Heart Attack: డోన్‌లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
-
America vs Iran: అమెరికా యుద్ధ నేరాలకు సాక్ష్యాలు.. పిల్లలను కూడా వ*దలలేదు..!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!