Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!

Cultural Destruction

Cultural Destruction

యుద్ధం ముగిసిన తర్వాత ఇళ్లను మళ్లీ నిర్మించుకోవచ్చు. రోడ్లను తిరిగి వేయొచ్చు. కానీ వందల ఏళ్ల చరిత్రను, ప్రజల జ్ఞాపకాలను, వారి సంస్కృతికి ఆనవాళ్లుగా నిలిచిన కట్టడాలను తిరిగి తీసుకురావడం సాధ్యమా?

2026 ఆగస్టు యుక్రెయిన్‌కు అలాంటి విషాదాన్నే మిగిల్చింది. రష్యా వైమానిక దాడులు ఒక్కసారిగా పెరిగి వేలాది డ్రోన్లు దూసుకొచ్చాయి. కీవ్‌తో పాటు మైకొలైవ్, ఒడెస్సా నగరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒడెస్సాలో యునెస్కో రక్షణలో ఉన్న ఆరు సాంస్కృతిక ప్రదేశాలు దెబ్బతిన్నాయి. వాటిలో 19వ శతాబ్దానికి చెందిన అలెగ్జాండ్రు హౌస్ కూడా ఉంది.

యుక్రెయిన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకారం అదే నెలలో 148 సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు ధ్వంసమయ్యాయి. ఇక్కడే ఒక అసౌకర్యమైన ప్రశ్న మొదలవుతుంది. ఒక చారిత్రక భవనాన్ని కావాలనే ధ్వంసం చేస్తే అది కూడా యుద్ధ నేరమే. దానికి చట్టాలున్నాయి. ఆధారాలున్నాయి. శాటిలైట్ చిత్రాలున్నాయి. దాడులను నమోదు చేస్తున్న నిపుణులున్నారు. అయినా బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకోవడం ఎందుకు ఇంత కష్టంగా మారింది? యుక్రెయిన్‌కు చెందిన పలు సంస్థలు రష్యాపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో ఫిర్యాదులు చేసినా ఇప్పటివరకు సాంస్కృతిక విధ్వంసానికి సంబంధించి ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదు.

గాజాలోని గ్రేట్ ఒమరీ మసీదు కథ ఈ నష్టానికి మరో ముఖాన్ని చూపిస్తుంది. ఒకప్పుడు అక్కడ పగన్ ఆలయం ఉండేది. తర్వాత బైజాంటైన్ చర్చిగా మారింది. ఏడో శతాబ్దంలో మసీదుగా మారింది. క్రూసేడర్ల కాలంలో కేథడ్రల్‌గా మారి, ఆ తర్వాత మళ్లీ మసీదుగా నిలిచింది. అంటే ఆ భవనం గాజా చరిత్రలోని ఎన్నో శతాబ్దాలను తనలో దాచుకుంది. 2023లో జరిగిన ఇజ్రాయెల్ దాడిలో అది దాదాపు పూర్తిగా ధ్వంసమైంది.

ఇదే భయం ఇరాన్‌లోనూ కనిపించింది. ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక యుద్ధం తర్వాత 100కు పైగా సాంస్కృతిక ప్రదేశాలు దెబ్బతిన్నట్లు నివేదికలు వచ్చాయి. టెహ్రాన్‌లోని యునెస్కో వారసత్వ ప్రదేశం గోలెస్తాన్ ప్యాలెస్, ఇస్ఫహాన్‌లోని జహాన్ స్క్వేర్ కూడా ఆ జాబితాలో ఉన్నాయి. సూడాన్‌లో యుద్ధం వేల ఏళ్ల నాటి మెరోయే పిరమిడ్లను ప్రమాదంలోకి నెట్టింది. 2011లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన ఆ ప్రాంతంలో సంరక్షణ పనులు ఆగిపోయాయి. ఇప్పుడు ఇసుక, మొక్కలు ఆ పురాతన నిర్మాణాలపై నెమ్మదిగా తమ ముద్ర వేస్తున్నాయి.

ప్రపంచం ఈ ప్రమాదాన్ని ఎప్పుడో గుర్తించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1954లో హేగ్ కన్వెన్షన్ వచ్చింది. యుద్ధ సమయంలో చారిత్రక కట్టడాలు, కళాఖండాలు, పుస్తకాలు వంటి సాంస్కృతిక ఆస్తులను రక్షించాల్సిన బాధ్యతను దేశాలపై పెట్టింది.

1999లో వచ్చిన రెండో ప్రోటోకాల్ మరింత రక్షణ కల్పించింది. 2002లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఏర్పడిన తర్వాత మతపరమైన, కళాత్మక, విద్యా, చారిత్రక ప్రదేశాలపై ఉద్దేశపూర్వక దాడులను యుద్ధ నేరాల పరిధిలోకి తీసుకువచ్చే అవకాశం ఏర్పడింది. అయినా ఫలితం ఆశించినంతగా లేదు. సాంస్కృతిక వారసత్వ విధ్వంసంపై ఐసీసీలో విజయవంతంగా శిక్ష పడిన కేసు ఇప్పటివరకు ఒక్కటే. మాలిలోని టింబక్టు సమాధులు, మసీదుపై దాడులను ఆదేశించిన జిహాదీ నాయకుడు అహ్మద్ అల్-ఫఖీ 2016లో దోషిగా తేలి తొమ్మిదేళ్ల జైలు శిక్ష పొందాడు.

ఇక కొన్ని ప్రాంతాల్లో చరిత్రను కాపాడే బాధ్యత ప్రభుత్వాల కంటే ముందుగా సాధారణ ప్రజల భుజాలపై పడుతోంది. యుక్రెయిన్‌లో యుద్ధం మొదలైనప్పుడు మ్యూజియంల నుంచి విలువైన కళాఖండాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రత్యేక పరికరాలతో వెళ్లే ఆ వాహనాలను హెరిటేజ్ అంబులెన్సులుగా పిలిచారు. బ్లూ షీల్డ్ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలు స్థానిక అధికారులతో కలిసి యుద్ధ ప్రాంతాల్లో వారసత్వాన్ని రక్షించేందుకు పనిచేస్తున్నాయి.

మోసుల్‌లో 2015లో ఐసిస్ సెంట్రల్ లైబ్రరీని తగలబెట్టినప్పుడు వేలాది పుస్తకాలు, అరుదైన మాన్యుస్క్రిప్టులు కాలిపోయాయి. ఆ లైబ్రరీతో తన జీవితాన్ని ముడిపెట్టుకున్న మహమ్మద్ జాసిమ్‌కు అది పుస్తకాల నష్టం మాత్రమే కాదు. తనలోని ఒక భాగం పోయినట్టుగా అనిపించింది. ఐసిస్ నుంచి మోసుల్ విముక్తి పొందిన తర్వాత ప్రజలు లైబ్రరీకి పరుగెత్తి మిగిలిన వాటిని కాపాడేందుకు ప్రయత్నించారు.

యుద్ధం సృష్టించే మరో ప్రమాదం.. దోపిడీ…! ఇరాక్, సిరియాల్లో ఐసిస్ ఆక్రమణ సమయంలో వేలాది పురాతన వస్తువులు దోచుకుని అంతర్జాతీయ మార్కెట్లకు తరలి వెళ్లాయి. అమెరికా న్యాయ శాఖ సంవత్సరాల దర్యాప్తు తర్వాత వాటిలో వేలాది కళాఖండాలను తిరిగి ఇరాక్‌కు చేర్చింది. యూరప్‌లోనూ పోలీసులు, కస్టమ్స్ సంస్థలు కలిసి దొంగిలించిన పురాతన వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నాయి. అయినా యుద్ధం కొనసాగుతున్న చోట్ల కొత్త దోపిడీకి అవకాశాలు పుడుతూనే ఉన్నాయి. 2023లో సూడాన్‌లోని ఖార్టూమ్ నేషనల్ మ్యూజియం ఒక వర్గం ఆధీనంలోకి వెళ్లిన తర్వాత అక్కడి విలువైన వస్తువులను ట్రక్కుల్లో తరలించారు. వేల ఏళ్ల చరిత్రను చెప్పిన గ్యాలరీలు ఖాళీగా మిగిలాయి.

ఈ కథలో అత్యంత విషాదకరమైన పేరు పాల్మైరా పురావస్తు శాస్త్రవేత్త ఖలీద్ అల్-అసాద్. 40ఏళ్ల పాటు ఆ పురాతన నగరాన్ని కాపాడిన ఆయనకు 80ఏళ్ల వయసులో ఐసిస్ ఎదురైంది. పురాతన కళాఖండాలు ఎక్కడ దాచారో చెప్పాలని అతడిని హింసించారు. ఆయన మాత్రం సమాచారం ఇవ్వలేదు. చివరికి 2015లో ఆయన్ను హత్య చేశారు. ప్రపంచం ఆయనను సంస్కృతిని కాపాడిన వ్యక్తిగా గుర్తించింది. సిరియాలోని కొత్త అధికారాల కాలంలో ఆయన పేరు పెట్టిన పాఠశాల పేరు కూడా తర్వాత మార్చారు

ఇక్కడే ఈ కథ మన ముందుకు మరో ప్రశ్నను తెస్తుంది. యుద్ధం ముగిసిన తర్వాత శిథిలాలను మళ్లీ నిర్మించగలమేమో కానీ ప్రజల గతాన్ని ఎవరు తిరిగి నిర్మిస్తారు? ఒక మ్యూజియంలో కాలిపోయిన పుస్తకాల్లోని జ్ఞానాన్ని ఎవరు తిరిగి రాస్తారు? శతాబ్దాల చరిత్రను మోసిన ఒక భవనం కూలిపోయినప్పుడు దాని రాళ్లను ఏరుకోవచ్చు. ఆ రాళ్లలో బతికిన జ్ఞాపకాలను మాత్రం తిరిగి ఏరుకోలేం.

చట్టాలు ఉన్నాయి. ఒప్పందాలు ఉన్నాయి. అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. కానీ వాటిని అమలు చేసే సంకల్పం బలహీనంగా ఉంటే యుద్ధం మనుషుల ప్రాణాలతో పాటు వారి గతాన్ని కూడా మింగేస్తూనే ఉంటుంది. ఎందుకంటే యుద్ధంలో పేలిపోయేది ఒక భవనం కావచ్చు కానీ దాని శిథిలాల కింద కొన్నిసార్లు ప్రజల జ్ఞాపకాలు కూడా కాలిపోతాయండి!