Gold Loan Recovery: గోల్డ్ లోన్ తీసుకున్న వారికి షాక్.. గండం ముంచుకొస్తోంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం ధరలు పెరుగుతున్నప్పుడు దాన్ని ఒక పెట్టుబడిగా చూసేవాళ్లు చాలామంది ఉంటారు. అవసరమైతే అదే బంగారాన్ని బ్యాంకుల్లోనో, ఆర్థిక సంస్థల్లోనో తనఖా పెట్టి అప్పు తీసుకుంటారు. ఇలా బంగారంపై రుణాలు ఇవ్వడం కూడా దేశంలో పెద్ద వ్యాపారంగా మారింది. అయితే ఇప్పుడు బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుతుండటంతో ఈ వ్యాపారంలో కొత్త సమస్యలు మొదలయ్యాయి.
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ధరల తగ్గుదల కొంత ఊరటనిస్తున్నా, బంగారాన్ని తనఖా పెట్టుకుని రుణాలు ఇచ్చిన సంస్థలకు మాత్రం పరిస్థితి వేరే రకంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే బంగారంపై అప్పులు తీసుకున్నవారికి కూడా ఈ ధరల పతనం కొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతోంది.
ముందుగా సమస్య ఎక్కడ మొదలవుతుందో అర్థం చేసుకుందాం. ఒక వ్యక్తి లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణాలను తనఖా పెట్టి 75 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడనుకుందాం. అంటే తనఖా పెట్టిన బంగారం విలువలో 75 శాతం మొత్తాన్ని రుణంగా పొందాడు. ఇప్పుడు ఆ బంగారం ధర 20 శాతం తగ్గిందని అనుకుందాం.
Also Read
- Cockroaches: ప్రకృతి రాసిన బొద్దింకల కథ!
- Rohingya Genocide: రోహింగ్యాలను కావాలనే చంపారు..తేల్చేసిన అంతర్జాతీయ న్యాయస్థానం!
- Marriages: "పెళ్లి వద్దు.. సింగిల్ లైఫే బెటర్".. యువత పెళ్లికి ఎందుకు దూరంగా ఉంటోంది? 4 ప్రధాన కారణాలివే..
- International Men's Day: "నువ్వు మగాడివి.. ఏడవకూడదు".. నవ్వుతూ కనిపించే ప్రతి పురుషుడి వెనుక ఓ కన్నీటి గాథ..
అప్పుడు లక్ష రూపాయల విలువ ఉన్న ఆభరణాల ధర 80 వేల రూపాయలకు పడిపోతుంది. అయితే ఆ వ్యక్తి తీసుకున్న అప్పు మాత్రం ఇంకా 75 వేల రూపాయలుగానే ఉంటుంది. అంటే సంస్థ దగ్గర ఉన్న బంగారం విలువకు, ఇచ్చిన అప్పుకు మధ్య తేడా చాలా తగ్గిపోతుంది. ఇక్కడే రుణ సంస్థలకు అసలు రిస్క్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ ఖాతాదారు అప్పు తిరిగి చెల్లించలేకపోతే, సంస్థ ఆ బంగారు ఆభరణాలను వేలం వేసి తన డబ్బును వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వేలంలో బంగారానికి వచ్చే డబ్బు కూడా తగ్గిపోతుంది. దీంతో సంస్థ ఇచ్చిన అసలు అప్పు మొత్తాన్ని కూడా పూర్తిగా వెనక్కి తెచ్చుకోవడం కష్టమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
ప్రస్తుతం ధరలు మరో 5 నుంచి 10 శాతం తగ్గితే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని కొన్ని సంస్థలు భావిస్తున్నాయి. కానీ ధరలు 15 శాతానికి మించి పడిపోతే మాత్రం గోల్డ్ లోన్ వ్యాపారంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ఆర్థిక రంగం అంచనా వేస్తోంది. ఇదే సమయంలో గోల్డ్ లోన్ తీసుకునే విధానంలో కూడా మార్పులు వస్తున్నాయి.
గతంలో చాలామంది రుణగ్రహీతలు ఒక ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించేవారు. రుణం తీసుకున్న తర్వాత ప్రతి నెలా వాయిదాలు చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. రుణ గడువు పూర్తయినప్పుడు అసలు, వడ్డీ కలిపి ఒకేసారి చెల్లించి తమ బంగారు ఆభరణాలను తిరిగి తీసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు పలు ఆర్థిక సంస్థలు ఈ విధానంతో పాటు కొత్త చెల్లింపు పద్ధతులను కూడా తీసుకొస్తున్నాయి. కొన్ని సంస్థలు ప్రతి నెలా వడ్డీ చెల్లించి, రుణ గడువు ముగిసినప్పుడు అసలు మొత్తాన్ని చెల్లించే విధానాన్ని అమలు చేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు గృహ రుణాలు, వాహన రుణాల తరహాలో ప్రతి నెలా అసలు, వడ్డీ కలిపి ఈఎంఐ చెల్లించే పద్ధతిని తీసుకొచ్చాయి. అయితే ఇన్నాళ్లూ పాత పద్ధతికి అలవాటు పడిన ఖాతాదారులకు ఈ కొత్త విధానాలు అంత సులభంగా అర్థం కావడం లేదు.
నెలవారీ చెల్లింపుల విషయంలో కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొందరు చెల్లింపులను ఆలస్యం చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ కొత్త మార్గదర్శకాల్లో ఈ విధానాలకు అనుమతి ఇచ్చినప్పటికీ, పాత పద్ధతిని పూర్తిగా రద్దు చేయలేదు. ఈ పరిణామాలన్నీ కలిసి ఇప్పుడు గోల్డ్ లోన్ సంస్థలను మరో ఆందోళనలోకి నెడుతున్నాయి.
బంగారం ధరలు మరింత తగ్గితే అప్పులు తీసుకున్నవారి చెల్లింపు సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా డిసెంబర్ నుంచి మార్చి మధ్య కాలంలో రుణాలు తిరిగి చెల్లించలేని వారి సంఖ్య పెరిగితే, తనఖా పెట్టిన ఆభరణాలను వేలం వేయాల్సిన పరిస్థితులు ఎక్కువ కావచ్చు. ఇక ఇప్పటికే కొన్ని సంస్థలు వేలానికి వెళ్లే ఆభరణాల గురించి అంచనాలు వేస్తున్నాయి.
ప్రస్తుత త్రైమాసికంలో దాదాపు 120 నుంచి 130 కోట్ల రూపాయల విలువైన తనఖా ఆభరణాలను వేలం వేయాల్సి రావచ్చని మణప్పురం ఫైనాన్స్ చైర్మన్ వీపీ నందకుమార్ చెబుతున్నారు. మరోవైపు రుణగ్రహీతలు తక్కువ కాలపరిమితి ఉన్న రుణాలు, నెలవారీ వడ్డీ చెల్లింపు విధానాలకు అలవాటు పడాలని ముత్తూట్ ఫైనాన్స్ ఎండీ అలెగ్జాండర్ జార్జ్ ముత్తూట్ సూచిస్తున్నారు. నెలవారీ వడ్డీ, ఈఎంఐ పద్ధతులపై సరైన అవగాహన లేకపోవడంతో కొందరు ఖాతాదారులు ఇప్పటికీ పాత చెల్లింపు విధానాన్నే కోరుకుంటున్నారని శ్రీరామ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉమేశ్ రేవంకర్ చెబుతున్నారు.
అయితే ఈ పరిస్థితిని చూసి గోల్డ్ లోన్ తీసుకున్నవారందరూ తమ బంగారాన్ని కోల్పోతారని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బంగారు ఆభరణాలతో చాలామంది కుటుంబాలకు ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సరే, తనఖా పెట్టిన నగలను తిరిగి ఇంటికి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుంటారు. అందుకే బంగారం ధర తగ్గినంత మాత్రాన అన్ని రుణాలూ మొండి బాకీలుగా మారిపోవు. ఇక ధరలు ఇలాగే తగ్గుతూ ఉంటే బంగారం పది గ్రాముల ధర 1,15,000 రూపాయల వరకు, కిలో వెండి ధర 1,40,000 రూపాయల వరకు రావచ్చని బులియన్ సంఘాలు అంచనా వేస్తున్నాయి.
ఇలా ఒకవైపు బంగారం ధరలు తగ్గడంతో కొనుగోలుదారులకు కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు అదే బంగారాన్ని ఆధారంగా చేసుకుని వేల కోట్ల రూపాయల రుణ వ్యాపారం చేస్తున్న సంస్థలు మాత్రం తమ దగ్గరున్న అప్పులు, తనఖా ఆభరణాల విలువ, రుణగ్రహీతల చెల్లింపుల సామర్థ్యాన్ని మళ్లీ లెక్కించుకోవాల్సి వస్తోంది. బంగారం ధరలో వచ్చే ప్రతి మార్పు ఇప్పుడు కేవలం కొనుగోలు మార్కెట్‌పైనే కాకుండా, దాని ఆధారంగా నడుస్తున్న రుణ వ్యాపారంపైనా ప్రభావం చూపిస్తోంది.
తాజావార్తలు
-
Gold Loan Recovery: గోల్డ్ లోన్ తీసుకున్న వారికి షాక్.. గండం ముంచుకొస్తోంది!
-
Deputy CM Pawan Kalyan: రామాంజులు మృతిపై పవన్ ఆరా.. నాగులగుట్టపల్లి ఘటనపై కీలక ఆదేశాలు..
-
IPL 2027-SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్.. ఐపీఎల్ 2027లో ఆడనున్న స్టార్ ప్లేయర్!
-
AP Panchayat Elections 2026: పంచాయతీ ఎన్నికల్లో కీలక మార్పులు.. పోలింగ్ కేంద్రాల విలీనంపై ఈసీ ఉత్తర్వులు
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
ట్రెండింగ్
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!
-
Jacob Duffy: బ్యాట్‌తో కాదు.. బంతితో డబుల్ సెంచరీ.. 22 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..!
-
Global Peace Honors: ‘గ్లోబల్ పీస్ హానర్స్’లో తారల సందడి.. సచిన్‌కు ప్రత్యేక గౌరవం..!
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం