Shahzad Bhatti: ఆపరేషన్ హైబ్రిడ్ టెర్రర్! ఉగ్రవాదుల ఖేల్ ఖతం.. ఎవరీ షాజాద్ భట్టి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తుపాకీ పట్టుకుని సరిహద్దులు దాటే ఉగ్రవాదులకు కాలం చెల్లిందా? మన పక్కింటి కుర్రాడు, సోషల్ మీడియాలో రీల్స్ చూసే యువకుడు, బిర్యానీ వ్యాపారి.. రాత్రికి రాత్రే దేశద్రోహ నెట్‌వర్క్‌లో పావులుగా మారుతున్నారా? అవును.. దేశ రాజధాని మొదలుకొని 14 రాష్ట్రాల్లో భద్రతా దళాలు చేపట్టిన ఒక మెగా ఆపరేషన్ అత్యంత ప్రమాదకరమైన నిజాన్ని బట్టబయలు చేసింది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ నుంచి దుబాయ్ వరకు విస్తరించిన నేర సామ్రాజ్యం.. ఇప్పుడు దేశీయ ముఠాలతో చేతులు కలిపి ఉగ్రవాదానికి సరికొత్త రూపునిచ్చింది. ఆగస్టు 12న వెలుగుచూసిన షాజాద్ భట్టి నెట్వర్క్ కేవలం ఒక ముఠా మాత్రమే కాదు.. ఆధునిక గూఢచర్యం, సైబర్ ఆకర్షణ, వ్యవస్థీకృత నేరం కలగలిసిన ఒక భయానక హైబ్రిడ్ వార్ఫేర్!
స్వాతంత్ర్య దినోత్సవానికి కొద్ది రోజుల ముందు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ఏజెన్సీలు, రాష్ట్రాల పోలీసు బలగాలు సమన్వయంతో దేశవ్యాప్త మెరుపు దాడులు నిర్వహించాయి. ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, కర్ణాటక, గుజరాత్, బీహార్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, కేరళ సహా మొత్తం 14 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో ఏకంగా 253 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం 80కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, 200 మందికి పైగా అరెస్టులు రికార్డయ్యాయి. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం-UAPA, భారతీయ న్యాయ సంహిత-BNS, ఆయుధాల చట్టం, NDPS చట్టం, పేలుడు పదార్థాల చట్టం కింద ఈ కేసులు నమోదయ్యాయి. ఈ సోదాల్లో IEDలు, పిస్టల్స్, లైవ్ మందుగుండు సామగ్రి, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ-POF మార్క్ ఉన్న గ్రెనేడ్లు, గూఢచర్యం కోసం వాడిన అత్యాధునిక CCTV పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
Also Read
ఈ మొత్తం ముఠాకు సూత్రధారి ఒకే ఒక్కడు. అతడే 45 ఏళ్ల షాజాద్ భట్టి. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన భట్టి బ్యాక్ గ్రౌండ్ చూస్తే దిమ్మదిరిగిపోవడం ఖాయం.2013లో పాకిస్తాన్ పోలీసు రికార్డుల ప్రకారం ఇతనిపై దొంగతనాలు, దోపిడీల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మరింత తీవ్రమైన నేరాలకు పాల్పడి దుబాయ్‌కి పారిపోయాడు. అక్కడ వ్యాపార ముసుగులో అంతర్జాతీయ నేర నెట్‌వర్క్‌లతో పాటు ISI హ్యాండ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు.
ఇక్కడే భట్టి తన పంథాను మార్చాడు. “333” అనే బ్యానర్ కింద సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ.. మతం, భారత్-పాకిస్తాన్ సంబంధాలు, వివాదాస్పద అంశాలపై మాట్లాడేవాడు. తనను తాను ఒక వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా, వ్యాఖ్యాతగా ప్రొజెక్ట్ చేసుకున్నాడు. ఈ ఆన్లైన్ ఇమేజ్ ద్వారా సంప్రదాయ ఉగ్రవాదంతో ఎలాంటి సంబంధం లేని సాధారణ యువతను సులభంగా ఆకర్షించగలిగాడు.
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి మాధ్యమాలే వేదికగా షాజాద్ భట్టి రిక్రూట్మెంట్ సాగింది. ప్రైవేట్ మెసేజ్‌లు, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా యువతతో పరిచయాలు పెంచుకున్నాడు. భావజాలం కంటే త్వరితగతిన డబ్బు సంపాదించాలనే ఆశ, తుపాకుల వీడియోలతో కూడిన గ్యాంగ్‌స్టర్ లైఫ్‌స్టైల్ క్రేజ్, విదేశాల్లో స్థిరపడే అవకాశాలను ఎరగా చూపించాడు.
రిక్రూట్ అయిన వారిలో బిర్యానీ వ్యాపారి, అల్లం అమ్ముకునే వ్యక్తి, వడ్డీ వ్యాపారి వంటి సాధారణ ఉద్యోగాలు చేసే పేద, మధ్యతరగతి యువకులు ఉన్నారు. ప్రారంభంలో ప్రచారం లేదా పోస్టర్లు వేయడానికి చిన్న మొత్తాలు చెల్లించి, ఆ తర్వాత పోలీసులపై దాడులు చేయడం వంటి పెద్ద పనులకు భారీ మొత్తాలు ఆఫర్ చేస్తూ క్రమంగా వారిని నేర ఊబిలోకి లాగాడు. ‘తెహ్రీక్-ఎ-తాహ్రీక్-ఎ-తాలిబాన్ హిందుస్థాన్’ పేరిట ఢిల్లీ, ఫరీదాబాద్‌లలో పోస్టర్లు వేయించాడు. దాడుల వీడియోలను ఆన్లైన్లో సర్క్యులేట్ చేయించడం ద్వారా ప్రచార యుద్ధానికి తెరలేపాడు.
షాజాద్ భట్టి నెట్వర్క్ వ్యూహం ఒక్కటే.. తక్కువ ఖర్చుతో కూడిన ‘డిస్పోజబుల్ ఆపరేటివ్స్’ను సృష్టించడం. ఒకరు కేవలం GPS లొకేషన్లు, వీడియోలు తీసి పంపితే, మరొకరు సీసీటీవీ కెమెరాలు బిగించి నిఘా పెడతారు. ఇంకొకరు లాజిస్టిక్స్, సిమ్ కార్డులు, రవాణా చూసుకుంటారు. ఫైనల్ దాడి చేయడానికి మాత్రమే ప్రత్యేకంగా ఒకరిని ఎంచుకుంటారు. ఎవరికి వారే స్వతంత్రంగా వ్యవహరించడం వల్ల ఒకరు పట్టుబడినా మొత్తం నెట్వర్క్ బయటపడదు. హోం మంత్రిత్వ శాఖ వెల్లడించిన ప్రకారం.. నిఘా, టార్గెట్ ఎంపిక, లాజిస్టిక్స్, చెల్లింపులు అన్నీ సరిహద్దుల ఆవల నుంచే జరిగాయి. పోలీసు స్టేషన్లు, రక్షణ స్థావరాలు, రద్దీగా ఉండే ప్రాంతాలు, మతపరమైన ప్రదేశాలపై సీసీటీవీల ద్వారా రహస్య సమాచారాన్ని సేకరించడమే వీరి ప్రధాన లక్ష్యం.
ఆగస్టు 12న జరిగిన 253 మంది నిర్బంధం ఈ కుట్రను తాత్కాలికంగా అడ్డుకుని ఉండవచ్చు. కానీ, క్షేత్రస్థాయిలో ముఖం తెలియని హ్యాండ్లర్లు, సోషల్ మీడియా అల్గారిథమ్స్ వెనుక నక్కిన ఉగ్ర సూత్రధారులు మన దేశ యువతనే పావులుగా వాడుకుంటున్న వేళ.. భద్రతా ముప్పు సరికొత్త సాంకేతిక యుద్ధానికి దారితీస్తోంది. ఇది సరిహద్దుల్లో తుపాకులతో చేసే యుద్ధం మాత్రమే కాదు.. డిజిటల్ తెరల వెనుక సాగుతున్న అత్యంత ప్రమాదకరమైన అదృశ్య యుద్ధం!
:- CLN RAJU (EDITOR-NTV DIGITAL)
తాజావార్తలు
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!