Bi-Monthly Salary: నెలలో రెండుసార్లు జీతాలు? ఇండియాలో శాలరీలు ఇచ్చే విధానం మారనుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెలాఖరు వచ్చిందంటే జీతం కోసం ఎదురుచూపులు.. బ్యాంక్ అకౌంట్లో మెసేజ్ పడిందంటే ఊరట.. ఆ ఊరటతోనే ఇంటి అద్దె, ఈఎంఐలు, పిల్లల ఫీజులు, కరెంట్ బిల్లులు, క్రెడిట్ కార్డ్ బకాయిలు అన్నీ వరుసగా తీర్చే జీవితం కోట్లాది ఉద్యోగులది. అయితే ఒకసారి ఊహించండి.. నెలకు ఒకసారి కాదు, నెలలోనే రెండు సార్లు జీతం వస్తే ఎలా ఉంటుంది? నెల 15న సగం జీతం, నెలాఖరున మిగతా సగం జీతం అకౌంట్లో పడితే ఉద్యోగుల జీవితం నిజంగా సులభమవుతుందా? లేదా ఇది వినడానికి బాగానే ఉన్నా అమలు చేయడానికి కష్టమైన ఆలోచనగా మిగిలిపోతుందా? ప్రస్తుతం భారత కార్పొరేట్ ప్రపంచంలో ఇదే నడుస్తోంది.
అనుపమ్ మిట్టల్ ఏం అంటున్నారు?
ఈ చర్చకు కారణం ప్రముఖ వ్యాపారవేత్త, షార్క్ ట్యాంక్ ఇండియా జడ్జి, షాదీ డాట్ కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్. ఉద్యోగులకు జీతాలు ఎలా చెల్లిస్తున్నామనే విషయంలో కంపెనీలు మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
సాధారణంగా భారత్‌లో చాలా సంస్థలు ఉద్యోగుల జీతాలను నెల పూర్తయిన తర్వాత వచ్చే నెల మొదటి తేదీన లేదా మొదటి వారంలో జమ చేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో సెలవులు, బ్యాంకింగ్ సమస్యలు, పరిపాలనా ఆలస్యాల కారణంగా జీతం మరింత ఆలస్యమవుతుంది. కానీ ఒక వారం ఆలస్యం కూడా ఉద్యోగి జీవితంలో పెద్ద ప్రభావం చూపుతుందని అనుపమ్ మిట్టల్ చెబుతున్నారు. ఎందుకంటే జీతం ఆలస్యమైతే ముందుగా దెబ్బతినేది ఉద్యోగి నగదు ప్రవాహం. ఇంటి అద్దె చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ ఈఎంఐ కట్ అవుతుంది. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించాలి. ఇవన్నీ నిర్ణీత తేదీలకే జరుగుతాయి. జీతం ఆలస్యం అయితే బ్యాంక్ జరిమానాలు, అదనపు వడ్డీలు, అప్పులు లేదా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే డబ్బు సమయానికి అందుబాటులో ఉండటం అనేది కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదని, అది వ్యక్తిగత గౌరవానికి కూడా సంబంధించిన విషయమని ఆయన వాదిస్తున్నారు.
Also Read
- Psychology Facts: 'లైట్ తీసుకో, పట్టించుకోకు..' ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
- Explainer: '2012' సినిమా.. నేపాల్ విపత్తును ముందే ఊహించిందా?
- America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
- IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
అందుకే నెలలో రెండు సార్లు జీతం చెల్లించే విధానాన్ని ఆయన ప్రతిపాదించారు. అంటే ఉద్యోగి నెల జీతాన్ని రెండు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని 15వన, మరో భాగాన్ని నెలాఖరున చెల్లించడం. ప్రస్తుతం నెలకు ఒకసారి జీతం చెల్లించే విధానంలో ఏడాదికి 12 సార్లు మాత్రమే జీతం వస్తుంది. అదే ద్వైమాసిక వేతన విధానంలో ఏడాదికి 24 సార్లు జీతం అందుతుంది. మొత్తం జీతం మాత్రం మారదు. మారేది కేవలం చెల్లింపు సమయం మాత్రమే.
ఇతర దేశాల్లో ఈ వ్యవస్థ ఎలా ఉంది?
ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇప్పటికే ఇలాంటి విధానాలు అమలులో ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో కంపెనీలు తమ అవసరాలకు అనుగుణంగా వారానికోసారి, రెండు వారాలకు ఒకసారి, నెలలో రెండుసార్లు లేదా నెలకు ఒకసారి జీతాలు చెల్లిస్తున్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఒకే విధానం ఉండాల్సిన అవసరం లేదని అక్కడి వ్యవస్థలు చూపిస్తున్నాయి. అయితే భారత్‌లో పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. దశాబ్దాలుగా భారత ఉద్యోగుల ఆర్థిక జీవితం మొత్తం మంత్లీ సైకిల్ చుట్టూనే తిరుగుతోంది. ఇంటి అద్దె సాధారణంగా నెల మొదట్లో చెల్లిస్తారు. పిల్లల స్కూల్ ఫీజులు నెలవారీగా ఉంటాయి. బ్యాంక్ ఈఎంఐలు కూడా నెలకు ఒకసారి కట్ అవుతాయి. ఇన్సూరెన్స్ ప్రీమియంలు, హౌసింగ్ లోన్లు, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు అన్నీ కూడా నెలవారీ వ్యవస్థకే అనుగుణంగా రూపొందించి ఉన్నాయి. దీనికారణంగా జీతం రెండు సార్లు వచ్చినంత మాత్రాన ఉద్యోగుల ఆర్థిక సమస్యలు వెంటనే పరిష్కారమవుతాయని చెప్పడం కష్టం.
ఈ అంశంపై నిపుణులు కూడా మిశ్రమ అభిప్రాయాలనే వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు డబ్బు తరచుగా అందుబాటులో ఉంటే ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని వారు అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా నెల మధ్యలో డబ్బు కొరత ఎదుర్కొనే వారికి ఇది కొంత ఉపశమనం కలిగించవచ్చు. అత్యవసర ఖర్చుల కోసం క్రెడిట్ కార్డులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గవచ్చు. కొంతమంది ఉద్యోగులకు ఇది మానసిక ప్రశాంతతను కూడా అందించవచ్చు.
అయితే అసలు సమస్య జీతం ఎప్పుడు వస్తోందన్నది కాదని, డబ్బు ఎలా ఖర్చు చేస్తున్నారు అన్నదేనని మరో వాదన వినిపిస్తోంది. ఒక ఉద్యోగి నెలకు 60 వేల రూపాయలు సంపాదిస్తున్నాడనుకుందాం. నెల మొదటి రోజే 30 వేల రూపాయలు ఖర్చు చేసే అలవాటు ఉంటే, జీతాన్ని రెండు భాగాలుగా ఇచ్చినంత మాత్రాన అతను అకస్మాత్తుగా పొదుపు చేయడం ప్రారంభించడు. బదులుగా వచ్చే చెల్లింపును ముందుగానే లెక్కలో పెట్టుకుని మళ్లీ ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఇక కంపెనీల పరంగా చూస్తే ఈ మార్పు అంత సులభం కాదు. ప్రస్తుతం భారత్‌లోని పన్నుల వ్యవస్థ, గ్రాట్యుటీ లెక్కలు, బోనస్ విధానాలు, వేతన చట్టాలు..ఇలా అన్నీ నెలవారీ జీతాల ఆధారంగానే రూపుదిద్దుకున్నాయి. నెలకు ఒకసారి జరిగే పేరోల్ ప్రక్రియను రెండు సార్లు నిర్వహించాలంటే అదనపు సాంకేతిక వ్యవస్థలు, అకౌంటింగ్ మార్పులు, బ్యాంకింగ్ సమన్వయం, పరిపాలనా ఖర్చులు అవసరమవుతాయి. చిన్న, మధ్యతరహా సంస్థలకు ఇది మరింత భారంగా మారే అవకాశం ఉంది.
ఇంకో ముఖ్యమైన అంశం ఉద్యోగుల అభిప్రాయం. సాధారణంగా ఉద్యోగులు ఉద్యోగం ఎంచుకునేటప్పుడు జీతం ఎంత, పెరుగుదల అవకాశాలు ఏంటి? కంపెనీ కల్చర్ ఎలా ఉంది? కెరీర్ ఎదుగుదల ఎలా ఉంటుంది లాంటి అంశాలనే ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటారు.
జీతం నెలకు ఒకసారి వస్తుందా, రెండుసార్లు వస్తుందా అనేది చాలా సందర్భాల్లో నిర్ణయాత్మక అంశంగా ఉండదు. ముఖ్యంగా యువ ఉద్యోగులు నేర్చుకునే అవకాశాలు, పని స్వేచ్ఛ, కెరీర్ గ్రోత్ వంటి విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఈ చర్చ ఒక ముఖ్యమైన ప్రశ్నను మాత్రం ముందుకు తెచ్చింది. డిజిటల్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించే పద్ధతులు కూడా మారాలా లేదా అన్నది కూడా థింక్ చేయాలి. ఇక దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలా, లేదా ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా కొత్త మార్గాలను అన్వేషించాలా అనే ప్రశ్న ఇప్పుడు కార్పొరేట్ రంగం ముందుంది.
మొత్తంగా చూస్తే నెలలో రెండుసార్లు జీతం చెల్లించే విధానం వినడానికి బాగానే కనిపిస్తోంది. కొంతమంది ఉద్యోగులకు ఇది ఆర్థిక ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉంది. అయితే ఇది అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఆర్థిక అవగాహన పెరగడం, జీతాల స్థాయి మెరుగుపడటం, ఖర్చుల నియంత్రణ వంటి అంశాలు కూడా అంతే ముఖ్యమైనవి. సాంకేతికంగా చూస్తే ఈ మార్పు సాధ్యమే. కానీ భారత్ నిజంగా నెలవారీ జీతాల వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందా లేదా అన్న ప్రశ్నకు సమాధానం మాత్రం ఇంకా స్పష్టంగా కనిపించడం లేదు.
తాజావార్తలు
-
Polavaram Rehabilitation: తాడువాయిలోనే ఇళ్లు కావాలి.. పోలవరం నిర్వాసితుల భారీ ధర్నా!
-
Rana Daggubati: ఇక హీరోల హవా తగ్గినట్టేనా? డైరెక్టర్ల బ్రాండ్‌పై రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Devarakonda Family : దేవరకొండ ఫ్యామిలీ నుండి నెలకో సినిమా రిలీజ్‌కు రెడీ
-
BJPలో చేరిన రాఘవ్ చడ్డాకు ఓటర్ లిస్ట్ షాక్.. పంజాబ్ ఓటర్ లిస్ట్‌లో పేరు మాయం!
-
Imam ul Haq Ban: గాయం అంటూ నాటకాలు.. పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌పై రెండేళ్ల నిషేధం!
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!