Explainer: ముస్లిం దేశాలు రగిలిపోవడానికి కారణమేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మక్కా వైపు హౌతీల డ్రోన్ దూసుకొచ్చిందన్న వార్తతో ముస్లిం ప్రపంచం ఒక్కసారిగా అగ్నిగోళంలా మారిపోయింది. కాబా ఉన్న పవిత్ర నగరంపైకి యుద్ధం నీడ పడిందన్న వార్త కోట్లాది ముస్లింల గుండెల్లో ఆగ్రహాన్ని రగిలించింది. ఆ డ్రోన్ మక్కా నిషేధిత గగనతలంలోకి చేరకముందే సౌదీ అరేబియా వైమానిక రక్షణ వ్యవస్థ దాన్ని గాల్లోనే కూల్చేసింది. ఒక చిన్న లోహపు యంత్రం ఆకాశంలో ముక్కలైంది. కానీ దాని వెంట లేచిన కోపానికి అంత త్వరగా ముగింపు కనిపించడం లేదు.
పాకిస్థాన్ నుంచి టర్కీ వరకు, మలేషియా నుంచి బంగ్లాదేశ్ వరకు, మాల్దీవులు, యూఏఈ, సోమాలియా వరకు ముస్లిం దేశాలు తీవ్రంగా స్పందించాయి. మక్కా పవిత్రతను, అక్కడి ప్రజల భద్రతను తాకే ఏ ప్రయత్నమైనా సహించబోమన్న సందేశం వెలువడింది. ఇస్లామిక్ దేశాల సమాఖ్య OIC కూడా ఘాటుగా స్పందించింది. మక్కా, మదీనా ప్రాంతాల వైపు జరిగే దాడులు అమాయకుల్లో భయాన్ని రగిలించడంతో పాటు ప్రపంచ ముస్లింల మనోభావాలను కుదిపేస్తాయని ఆ సంస్థ చెప్పింది.
ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారన్నది మాత్రం ఇంకా వివాదంగానే ఉంది. సౌదీ అరేబియా హౌతీలను బాధ్యులుగా చెబుతోంది. హౌతీలు మాత్రం ఆ ఆరోపణను తిరస్కరిస్తున్నారు. అయినా ఈ ఘటన జరిగిన సమయం, దాని వెనుక ఉన్న యుద్ధ వాతావరణం చూస్తే అసలు కథ మక్కా ఆకాశంలో మొదలైనది కాదని అర్థమవుతుంది.
Also Read
ఆ కథ యెమెన్‌లోని రక్తంతో తడిసిన నేలలో మొదలైంది. యెమెన్‌లో హౌతీలు, సౌదీ అరేబియా మధ్య పోరు మళ్లీ తీవ్రమవుతోంది. యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులు ఒకదానికొకటి సమాధానాలు చెబుతున్నాయి. హౌతీలు సౌదీ ఎఫ్-15 యుద్ధవిమానాన్ని యెమెన్‌లో కూల్చేశామని ప్రకటించారు. సౌదీ అరేబియా మాత్రం ఆ వాదనను ధృవీకరించలేదు.
ఇదే సమయంలో ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో, బాబ్ అల్-మందెబ్ జలసంధి చుట్టూ కూడా సైనిక ఉద్రిక్తత పెరుగుతోంది. ఆ జలసంధి పేరు చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ప్రపంచ వాణిజ్యానికి అది ఒక కీలకమైన ద్వారం. ఆ ద్వారం దగ్గర యుద్ధం మొదలైతే ప్రభావం యెమెన్లోనే ఆగిపోదు. నౌకలు మార్గాలు మార్చుకోవాల్సి వస్తుంది. రవాణా ఖర్చులు పెరుగుతాయి. చమురు సరఫరాపై ఒత్తిడి పెరుగుతుంది. మధ్యప్రాచ్యంలో వెలిగిన ఒక్క మంట ప్రపంచ మార్కెట్లలో మరో రూపంలో కనిపిస్తుంది.
ఇంతలో సౌదీ చమురు వ్యవస్థపైనా దాడి జరిగింది. ఇరాక్ ప్రాంతం నుంచి ప్రయోగించినట్లు చెబుతున్న డ్రోన్లు సౌదీ ఈస్ట్-వెస్ట్ క్రూడ్ ఆయిల్ పైప్‌లైన్‌ను తాకాయి. ఆ మార్గాన్ని మరమ్మతుల కోసం తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది.
హోర్ముజ్ జలసంధి చుట్టూ రవాణా ప్రమాదంలో పడినప్పుడు సౌదీ చమురును అల్టెర్నెట్ మార్గంలో తరలించడానికి ఈ పైప్‌లైన్ అత్యంత కీలకం. ఆ మార్గంపై దెబ్బ పడటం అంటే సౌదీ ఆర్థిక వ్యవస్థలోని ఒక ముఖ్యమైన నరాన్ని కోయడానికి చేసిన ప్రయత్నంలా మారింది. యెమెన్ ప్రజల పరిస్థితి ఈ యుద్ధానికి మరో భయంకరమైన ముఖాన్ని చూపిస్తోంది. ఘర్షణలు పెరిగిన తర్వాత సుమారు లక్షా25వేల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.
కొందరు ప్రాణాలు కాపాడుకోవడానికి ఎర్ర సముద్రాన్ని దాటి జిబౌటికి చేరుకున్నారు. ఒకవైపు నేలపై ఇళ్లు ఖాళీ అవుతున్నాయి. మరోవైపు సముద్రంలో నౌకలు భయంతో మార్గాలు వెతుక్కుంటున్నాయి. ఆకాశంలో డ్రోన్లు తిరుగుతున్నాయి. ఇప్పుడు ఆ ఆకాశమే మక్కా వైపు వంగింది. మక్కా దిశగా వచ్చిన ఆ డ్రోన్ కూలిపోయింది కానీ ఈ ఘటనతో యెమెన్ యుద్ధం మరో ప్రమాదకరమైన సరిహద్దును తాకింది. ఇటు ముస్లిం దేశాల ఆగ్రహం పెరుగుతోంది. సౌదీ అరేబియా తన భద్రతను మరింత కఠినతరం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఎర్ర సముద్రం, బాబ్ అల్-మందెబ్, చమురు మార్గాలు ఇప్పటికే ఉద్రిక్తతలో ఉన్నాయి. ఇప్పుడు మక్కా పేరు కూడా ఈ యుద్ధం మధ్యలోకి వచ్చింది. నిజానికి యుద్ధాల్లో కొన్ని క్షణాలు బాంబుల కంటే పెద్ద శబ్దం చేస్తాయి. మక్కా వైపు దూసుకొచ్చిన ఆ డ్రోన్ అలాంటి క్షణమే. ఆకాశంలో అది కూలిపోయింది కానీ దాని నీడ ఇంకా మధ్యప్రాచ్యంపై నిలిచే ఉంది. మరి ఆ నీడ తర్వాత ఎన్ని విధ్వంసాలకు కారణమౌతుందో వేచిచూడాల్సిందే!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!