Tech News: మనల్ని మింగేసే రాక్షసి..! బాంబు పేల్చిన ‘క్లాడ్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Explainer: టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పుడు ఒకటే వణుకు. మనం సృష్టించిన రోబోలు, మన ఆలోచనల నుంచి పుట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. రేపు మనల్నే శాసించబోతున్నాయా? మనిషి నియంత్రణ కోల్పోయే రోజు అత్యంత సమీపంలోనే ఉందా? అంటే అవుననే అంటోంది ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్. క్లాడ్ సృష్టికర్త అయిన ఈ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రగామి ఏఐ ల్యాబ్‌లన్నీ తమ పరిశోధనలను తక్షణమే నిలిపివేయాలని, ఒక సమన్వయంతో కూడిన విరామం ప్రకటించాలని సంచలన పిలుపునిచ్చింది. ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, మానవ నాగరికతకు రాబోతున్న ముప్పునకు ముందస్తు సంకేతం. సాంకేతికత ఇంత వేగంగా దూసుకుపోతుంటే, దాన్ని నియంత్రించాల్సిన సామాజిక వ్యవస్థలు ఎందుకు చతికిలబడుతున్నాయి? ఈ నిశ్శబ్దం వెనుక దాగున్న అసలు రహస్యాలు ఏంటి?
ఆంత్రోపిక్ బ్లాగ్‌లో ఏముంది?
ఆంత్రోపిక్ ఇటీవల విడుదల చేసిన ఒక బ్లాగ్ పోస్ట్ ప్రపంచ టెక్ రంగాన్ని ఒక్కసారిగా కుదిపేసింది.
సంస్థ సహ-వ్యవస్థాపకుడు జాక్ క్లార్క్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హెడ్ మెరీనా ఫవారో సంయుక్తంగా రాసిన ఈ వ్యాసంలో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తనను తాను స్వయంగా అభివృద్ధి చేసుకునే ‘రీకర్సివ్ సెల్ఫ్-ఇంప్రూవ్మెంట్’ దశకు అత్యంత వేగంగా చేరుకుంటోందని హెచ్చరించారు. తగినంత కంప్యూటింగ్ పవర్ లభిస్తే, ఒక ఏఐ సిస్టమ్ తన కంటే అత్యంత శక్తివంతమైన తదుపరి తరం ఏఐని మానవ ప్రమేయం లేకుండానే డిజైన్ చేసుకోగలదు. ఈ ‘సెల్ఫ్-బిల్డింగ్ ఏఐ’ సైన్స్, వైద్య రంగాలలో అద్భుతాలు సృష్టించగలిగినప్పటికీ, దీనివల్ల ఏఐ వ్యవస్థలపై మానవాళి పూర్తిగా నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని వారు కుండబద్దలు కొట్టారు. అందుకే, ప్రపంచవ్యాప్తంగా ఏఐ అభివృద్ధిని తాత్కాలికంగా నెమ్మదించడమో లేదా నిలిపివేయడమో చేయాలని వారు కోరుతున్నారు.
అయితే, ఏఐ రంగంలో ఆంత్రోపిక్ ప్రధాన ప్రత్యర్థి అయిన ఓపెన్ఏఐ అంతకుముందు విడుదల చేసిన ఒక నివేదికలో ఇందుకు భిన్నమైన వాదనను తెరపైకి తెచ్చింది. ఏఐ ఆవిష్కరణల వేగాన్ని ఏ ఒక్క ప్రైవేట్ ల్యాబ్ లేదా కంపెనీ లేదా స్వార్థ ప్రయోజనాలు ఉన్న గ్రూపులు నిర్ణయించకూడదని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మాత్రమే ఇందుకు సంబంధించిన నిబంధనలు, రక్షణ చర్యలు, బాధ్యతాయుతమైన యంత్రాంగాలను రూపొందించాలని ఓపెన్ఏఐ వాదించింది. ఈ రెండు దిగ్గజ సంస్థల మధ్య నడుస్తున్న ఈ సైద్ధాంతిక పోరాటం వెనుక కేవలం మానవతా దృక్పథం మాత్రమే లేదు. దాదాపు ఒక ట్రిలియన్ డాలర్ల విలువైన ఐపీఓ రేసులో దూసుకుపోతున్న తరుణంలోనే ఈ రెండు సంస్థలు ఇలా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం ఆసక్తి రేపుతోంది.
Also Read
- Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
- Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
- Peacock Mountain: ఇరాన్ పీకాక్స్ మౌంటైన్‌పై దాడికి ప్లాన్..ఈ అణు కేంద్రంపై అటాక్ జరిగితే అంతే సంగతి!
ఆంత్రోపిక్ ఈ హెచ్చరికలు ఎందుకు చేసింది?
ఆంత్రోపిక్ సంస్థ కేవలం ఊహాజనితంగా ఈ హెచ్చరికలు చేయడం లేదు. ఈ ఏడాది ఆరంభంలో ఆ సంస్థ విడుదల చేసిన ‘మిథోస్’ మోడల్ బ్యాంకింగ్, సాఫ్ట్వేర్ రంగాలలో పెద్ద భూకంపమే సృష్టించింది. కేవలం కోడింగ్ రాయడమే కాకుండా, ప్రస్తుతం ఉనికిలో ఉన్న కోడింగ్‌లోని లోపాలను అత్యంత వేగంగా గుర్తించగల సామర్థ్యం మిథోస్ మోడల్‌కు ఉంది. ఇటువంటి అడ్వాన్స్డ్ ఏఐ సిస్టమ్స్ తప్పుడు చేతుల్లోకి వెళ్తే జరిగే నష్టం ఊహాతీతం. సాంకేతికత ఇంత వేగంగా విస్తరిస్తున్నా, ప్రభుత్వాల నియంత్రణలు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ముఖ్యంగా అత్యధిక ఏఐ ల్యాబ్‌లకు నిలయమైన అమెరికాలో, ట్రంప్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్.. ఏఐ ల్యాబ్‌లపైనే పూర్తి బాధ్యతను పెట్టింది. అత్యంత సామర్థ్యమున్న మోడల్స్‌ను ప్రజల్లోకి విడుదల చేయడానికి ముందు, ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ టెస్టింగ్‌కు స్వచ్ఛందంగా సమర్పించాలని కోరడం ప్రభుత్వాల చేతకానితనానికి అద్దం పడుతోంది.
ఈ ఆందోళనలను నిజం చేస్తూ ఈ వారంలోనే యూనివర్సిటీ ఆఫ్ టొరంటో పరిశోధకుల బృందం ఒక భయంకరమైన నివేదికను బయటపెట్టింది. లీడ్ రీసెర్చర్ నికోలస్ పేపర్నాట్ నేతృత్వంలోని బృందం, ల్యాబొరేటరీలో ఒక సరికొత్త ఏఐ ‘వార్మ్’ను సృష్టించి చూపించింది. సాఫ్ట్వేర్ డెవలపర్లకు చౌకగా లభించే ఒక ‘ఓపెన్-సోర్స్’ ఏఐ టూల్‌ను ఉపయోగించి దీన్ని రూపొందించారు. ఈ ఏఐ వార్మ్ ఒక పరికరం నుండి మరో పరికరానికి వ్యాప్తి చెందుతూ, నెట్‌వర్క్‌లను ఆక్రమించుకునే క్రమంలో తన హ్యాకింగ్ వ్యూహాన్ని స్వయంగా మార్చుకోగలదు. గతంలో సైబర్ దాడి చేసేవారు కేవలం బ్యాంకులు, ఆసుపత్రులు, పవర్ గ్రిడ్లు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, పాఠశాలల వంటి హై-వాల్యూ టార్గెట్స్పైనే దృష్టి పెట్టేవారని, కానీ ఇప్పుడు మీ బేస్మెంట్లో ఉండే పాత లాప్టాప్ కూడా ఈ ఏఐ ఆధారిత హ్యాకింగ్ టూల్స్ కారణంగా ఒక ప్రమాదకరమైన లాంచ్ ప్యాడ్‌గా మారిపోతుందని నికోలస్ పేపర్నాట్ హెచ్చరించారు. ఇంటర్నెట్కు అనుసంధానమై ఉన్న ప్రతి వస్తువూ ఇప్పుడు ముప్పులో పడిందని ఆయన స్పష్టం చేశారు.
ఈ ముప్పును అడ్డుకోవడానికి ఆంత్రోపిక్ ప్రతిపాదిస్తున్న ‘సమన్వయ విరామం’ వెనుక ఒక బలమైన వ్యూహం ఉంది. అగ్రగామి ల్యాబ్‌లన్నీ తమ పరిశోధనలను ఆపినప్పుడు, ప్రత్యర్థి దేశాలు లేదా ల్యాబ్‌లు రహస్యంగా ముందుకు దూసుకుపోకుండా పరస్పరం తనిఖీ చేసుకునే వీలుండాలి. ఒకవేళ అంతర్జాతీయంగా ఇటువంటి సమన్వయ యంత్రాంగం లేకపోతే, భద్రతా ప్రమాణాలను అస్సలు పాటించని, అత్యంత అజాగ్రత్తగా ఉండే ప్లేయర్స్, దేశాలు ఈ గ్యాప్‌ను వాడుకుని ముందుకు దూసుకెళ్లే ప్రమాదం ఉంది. దీనివల్ల ఏఐ భద్రతపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వాలపై, సంస్థలపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. ఏఐ మానవ విలువలకూ, ఉద్దేశాలకూ అనుగుణంగా ఉండేలా చేసే ‘అలైన్మెంట్ రీసెర్చ్’తో పాటు, సామాజిక వ్యవస్థలు ఏఐ వేగాన్ని అందుకోవడానికి ఈ విరామ సమయం అత్యంత కీలకం.
ఏఐ పరిశోధనలను నిలిపివేయాలని శాస్త్రవేత్తలు కోరడం ఇదే మొదటిసారి కాదు. 2023లోనే ‘ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ ఇన్స్టిట్యూట్’ ఆధ్వర్యంలో ఎక్స్ఏఐ అధినేత ఇలోన్ మస్క్ సహా పలువురు ప్రముఖులు ఏఐ అభివృద్ధిని ఆరు నెలల పాటు నిలిపివేయాలని కోరారు. కానీ ఫలితం లేకపోయింది. ఆంత్రోపిక్ సంస్థ మొదటి నుండి తనను తాను ఒక సేఫ్టీ-ఫోకస్డ్ ల్యాబ్‌గా చెప్పుకుంటోంది. ఈ ఏడాది ప్రారంభంలో, అమెరికా సైన్యం తమ దేశీయ నిఘా కోసం, పూర్తిగా స్వయంప్రతిపత్తి కలిగిన ఆయుధాల కోసం తమ ఏఐ మోడల్స్‌ను ఉపయోగించకుండా యాంత్రోపిక్ నిరాకరించింది. దీనివల్ల అమెరికా ప్రభుత్వం నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొని, జాతీయ భద్రతా బ్లాక్‌లిస్ట్‌లోకి చేరింది. ఈ బ్లాక్‌లిస్ట్ ఈ 2026 సంవత్సరం చివర్లో అమలులోకి రానుంది.
“టెక్నాలజీ అభివృద్ధి చెందాలి, కానీ అది మానవాళిని మింగేసే రాక్షసిగా మారకూడదు. లాభాల వేటలో పడి భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేస్తున్న కార్పొరేట్ సంస్థలు, ఓపెన్ సోర్స్ టూల్స్ పేరిట సైబర్ నేరగాళ్లకు అందుబాటులోకి వస్తున్న ఏఐ ఆయుధాలు.. రాబోయే రోజుల్లో ఎంతటి విధ్వంసానికి దారితీస్తాయో ఊహించుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఆంత్రోపిక్ హెచ్చరిస్తున్నట్టుగా.. మనం ఇప్పుడే ‘పాజ్’ బటన్ నొక్కకపోతే, భవిష్యత్తులో ఏఐ మనల్ని ‘డిలీట్’ చేసే ప్రమాదం పొంచి ఉంది.
తాజావార్తలు
-
Bitchat: సీజేపీ నిరసనల్లో ఉపయోగించిన ‘‘బిట్‌చాట్’’ యాప్‌పై కేంద్రం చర్యలు..
-
Big Scam: సహకార సొసైటీలో భారీ స్కాం.. ఎరువులు రైతులకు ఇస్తున్నట్లు నమ్మించి రూ.1.60 కోట్లు స్వాహా…
-
CJI Surya kant: సీజేపీ నిరసనల పిటిషన్‌పై సూర్యకాంత్ కీలక ప్రకటన
-
Paper Leak Bill: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్లు జైలు, రూ. 10 కోట్ల జరిమానా.. ఆమోదించిన కేబినెట్..
-
Lothukunta Land Case: లోతుకుంట భూముల కేసులో హైడ్రాకు హైకోర్టు షాక్..
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!